పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/287

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రభువు తన దాసులకు దీర్షాయువు దయచేసాడు. వాళ్ళు పండు ముసలితనందాకా జీవిస్తారు. దేవాలయారాధనలో ప్రభువు భక్తులకు తన అనుగ్రహాన్ని దయ చేస్తాడు. ఈలా సజ్జనులు దేవునినుండి భౌతికమైన దీవెనలూ, ఆధ్యాత్మిక దీవెనలూ కూడ పొందుతారు. 14-16 చరణాల్లో మొత్తం మీద ఏడు దీవెనలు చెప్పాడు.

4. ప్రార్ధనా భావాలు

1. భక్తుడు దేవుణ్ణి నమ్మాలి అనేదీ, అలా నమ్మినవాణ్ణి దేవుడు తప్పకుండా కాపాడతాడు అనేదీ, ఈ కీర్తనలోని ముఖ్యాంశం. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళకు అన్నీ మంచికే సమకూరుతాయి - రోమా 8, 28. దేవుడు తన దాసులను గూర్చి శ్రద్ధ వహిస్తాడు. కనుక మనం మన చింతలన్నీ అతనిపై మోపవచ్చు - 1 పేత్రు 5,7.

2. దేవుడు మన పాలబడే ఆపదలనూ శోధనలనూ తొలగింపడు. వాటిల్లో తాను మనకు అండగా ఉంటాడు. మనకు బలాన్ని దయచేస్తాడు. ప్రభువు మన శక్తికిమించి మనలను శోధింపడు. అతడు మన శోధనల్లో మనకు కావలసిన శక్తిని దయచేస్తాడు. ఆ శోధనలనుండి బయటపడే మార్గాన్ని కూడ మనకు చూపిస్తాడు - 1కొ 10, 13. పౌలు నేను ఎప్పడు బలహీనుణ్ణి అప్పడే బలవంతుణ్ణి అని చెప్పకొన్నాడు. అనగా మన బలహీనతల్లో దేవుని వరప్రసాదం మనమీద ఎక్కువగా పనిచేస్తుంది - 2కొ 12, 9-10

3. పిశాచం మనలను శోధిస్తుంది. మన శత్రువైన పిశాచం గర్జించే సింహంలాగ తిరుగుతూ ఎవరిని కబళిద్దామా అని చూస్తూంటుంది - 1 పేత్రు 5,8, కాని దేవదూతలు నిరంతరమూ మనలను కాపాడుతుంటారు. ప్రభువుకి భయపడే వాళ్ళచుటూ అతని దూత శిబిరం పన్ని వాళ్ళని సకలాపదల నుండీ కాపాడుతుంటాడు - కీర్త 34,7. త్రోవలో మిమ్మకాపాడ్డానికి, నేను సిద్ధంచేసిన చోటికి మిమ్మ చేర్చడానికీ నా దూతను మీకు ముందుగా పంపుతున్నాను - నిర్గ 23, 20-22. ఈ దేవదూతలపట్ల మనకు గాఢమైన భక్తి ఉండాలి. వాళ్ళ సేవలను మనం వినియోగించుకోవాలి.

4. ఈ కీర్తనలోని 11-12 చరణాలను పిశాచం ఎడారిలో తపస్సు చేసికొనే క్రీస్తుకి విన్పించింది. దేవుణ్ణి పరీక్షకు గురిచేయమని క్రీస్తుని కోరింది - లూకా 4, 1011. దేవుడు ఆపదల్లో మనలను తప్పక కాపాడతాడు. కాని మన తరుపున మనం అతన్ని పరీక్షకు గురిచేయకూడదు.

279