పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1) కిప్పర్ అనే ప్రాయశ్చిత్త దినాన మాత్రమే ప్రధాన యాజకుడు మందసం వున్నదేవాలయ గర్భాగారంలోకి వెళ్తాడు. ఆనాడు అతడు మొదట కోడెను వధించి తన పాపాలకూ తోడి యాజకుల పాపాలకూ పరిహారంగా బలి నర్చిస్తాడు. దాని నెత్తటినీ సాంబ్రాణిని తీసికొని గర్భాగారంలోని మందసం వద్దకు వెళ్తాడు. మందసం మీది కరుణా ఫలకానికి సాంబ్రాణి పొగవేస్తాడు. కోడె నెత్తుటిని దాని ముందట ఏడుసార్లు చిలకరిస్తాడు - లేవీ 16,11-14. ఈ చిలకరింపు ద్వారా ప్రజల పాపాలు పరిహారమయ్యేవి.

2) తర్వాత ప్రధాన యాజకుడు ఒక మేకను తీసికొనివచ్చి దానిమీద చేతులు చాస్తాడు. ఇస్రాయేలీయుల పాపాలన్నీ ఆ మేక తలమీద మోపి దాన్ని అరణ్యంలోకి తోలతారు. అది వాళ్ళ పాపాలన్నీ మోసికొని పోతుంది. కనుక దానికి "పాపాలను మోసే మేక” అని పేరు - లేవీ 16,20-22.

3) బలిగా సమర్పించిన కోడె దేహాన్ని శిబిరం వెలుపలికి తీసికొనిపోయి అక్కడ కాల్చివేస్తారు - 16,27.

ఇకపై మూడంశాలు క్రీస్తు సిలువబలిలో ఎలా నెరవేరాయో పరిశీలిద్దాం.

1) యాజకుడు ఏడాదికి ఒకతూరి దేవాలయం గర్భాగారంలోకి వెళ్ళేవాడన్నాం. కాని క్రీస్తు యాజకుడు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళలేదు. అతడు తన దేహంలోకే తాను ప్రవేశించాడు. అతడు తన దేహంలోనే శ్రమలనుభవించి అటుపిమ్మట ఉత్తానమయ్యాడు. యెరూషలేం దేవాలయం తెర రెండుగా చినిగిపోయినప్పటి నుండి అతని దేహమే మన దేవాలయమవుతుంది. అనగా ఉత్థాన క్రీస్తే మన దేవాలయమౌతాడు. యెరూషలేం దేవళంలోని గర్భాగారంలోకి యాజకుడొక్కడే ప్రవేశిస్తే, ఈ ఉత్థాన క్రీస్తు దేహంలోకి భక్తులమైన మనమందరమూ ప్రవేశించవచ్చు - హెబ్రే 10,19–20. ఇంకా ఆ దేవళంలోని మూలస్థానంలోకి యాజకుడు ఏడాదికి ఒక్కసారి మాత్రమే వెళ్లేవాడు. కాని క్రీస్తు దేవళంలోకి మనం ఎప్పుడుబడితే అప్పడే వెళ్ళవచ్చు. యెరూషలేం దేవళంలోని యాజకుడు కొడె నెత్తుటిని తీసికొని వెళ్ళేవాడు. క్రీస్తు ఈలా జంతువుల నెత్తుటిని గాదు. తన సొంత నెత్తుటినే తీసికొని వెళ్ళాడు. అనగా అతడు సిలువమీద తన సొంత నెత్తుటినే చిందించాడు.

యెరూషలేంలో యాజకులు ఏటేట కిప్పూర్ దినాన జంతువును బలిగా సమర్పించేవాళ్ళు, కాని క్రీస్తు ఈలా చాలాసార్లు తన్ను బలిగా అర్పించుకోడు. అతడు ఒక్కసారి మాత్రమే తన్ను తాను బలిగావించుకొన్నాడు. ఈ యేకైక బలి మనలను శాశ్వతంగా రక్షించింది — 10,10.