పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/273

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


15-16. గడ్డి పొలంలోని పిచ్చిమొక్కలూ, అవిపూసే పూలూ క్షణమాత్రాలు. ఎడారినుండి వేడిగాలి తోలగానే అవి వాడిపోతాయి. నరులుకూడ ఈలాగే అల్పాయుష్కులు = యొష 40, 6–8.
17. కాని ప్రభువు తన భక్తులపట్ల చూపే ప్రేమ శాశ్వతమైంది. ఆ దేవుడుకూడ తన ప్రేమలాగే నిత్యుడు.
18. మనం ఆ ప్రభువు శాశ్వత ప్రేమను పొందాలంటే ఒక్క షరతును పాటించాలి. అతని నిబంధననూ కట్టడలనూ పాటించాలి.
19. దేవుడు ఆకసంనుండి రాజుగా పరిపాలనం చేస్తుంటాడు.
20-21. కీర్తనకారుడు దేవుని బంటులైన దేవదూతలను ఆ ప్రభువును స్తుతించమని అడుగుతున్నాడు.
22. వాన, గాలి, మెరుపులు మొదలైన సృష్టివస్తువులను కూడ ఆ ప్రభువుని స్తుతించమని అడుగుతున్నాడు. కడన, కీర్తన ప్రారంభంలోలాగే అంతంలోగూడ, దేవుణ్ణి స్తుతించడానికి తన్నుతాను ఆహ్వానించుకొంటున్నాడు. స్తుతి కీర్తనల్లో ఈ దైవస్తుతి ప్రచురంగా కన్పిస్తుంది.

4. ప్రార్ధనా భావాలు

1. ఈ కీర్తనలోని 8వ చరణం నిర్గమకాండం 34, 6-7 నుండి గ్రహించబడిందని చెప్పాం. ఇది పూర్వవేదంలోని గొప్ప వాక్యాల్లో ఒకటి. మనం సుకృత జపంగా వాడుకో దగ్గది.
2. 13వ చరణం దేవుణ్ణి నెనరుగల తండ్రిగా వర్ణిస్తుంది. అతడు ప్రధానంగా శిక్షకుడుకాదు, రక్షకుడు. మనం అతన్ని చూచి భయపడకూడదు. అతనిపట్ల మనకు చనువు ఉండాలి. దుడుకు చిన్నవాడి తండ్రి ఆ పిల్లవాడు తిరిగిరావడం జూచి అతన్ని కలుసుకోడానికి ఎదురు బోయాడు - లూకా 15,20. ఈ కీర్తన పేర్కొనే తండ్రి జాలి కూడ ఆలాంటిదే.
3. కీర్తనకారుడు ప్రభువు తనకు యువకుల బలమూ దీర్గాయువూ దయచేస్తాడని నమ్మాడు. నేడు మనం కూడ జ్ఞానస్నానంలో ఈ భాగ్యాన్ని పొందుతాం. రోజువారి జీవితంలో మన మార్జించే వరప్రసాదాలు గూడ ఈ వరాలను పెంచుకొంటూ బోతాయి.