పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అర్పణం. ఇది బాహ్య చిహ్నం. రెండవది, దేవునితో ఐక్యమై అతని దీవెనలు పొందాలి అనే భక్తుని అంతర్గతమైన కోర్కె మొదటిదానికంటె ఈ రెండవ అంశం ముఖ్యమైంది.

రక్తంద్వారా పాపపరిహారం జరుగుతుందని యూదుల భావం. కనుకనే లేవీయకాండం “ప్రతి జంతువు ప్రాణామూ దాని నెత్తురులో వుంటుంది. ఈ ప్రాణం ద్వారా నెత్తురు పాపపరిహారం చేస్తుంది" అని చెప్పంది - 17,11. కాని నెత్తురు ఎలా పాపపరిహారం చేస్తుంది? నెత్తురులోని ప్రాణం దేవుడిచ్చింది. భక్తుడు బలిపశువు నెత్తుటిని దేవుని పీఠంమీద పోసినపుడు దాని ప్రాణాన్నిదేవునికే అర్పించి నట్లవుతుంది. ఆ పశువు ప్రాణం ఒక విధంగా తన ప్రాణానికి చిహ్నంగా వుంటుంది. అనగా భక్తుడు బలిపశువు ప్రాణం ద్వారా తన ప్రాణాన్నీ జీవాన్నీ దేవునికి అర్పించుకొని అతనితో ఐక్యమౌతాడు అని చెప్పాలి. పూర్వవేదంలోని మూడు రకాల రక్తసహిత బలుల్లోను పశువు నెత్తుటిని పీఠం మీద పోస్తారు. ఆ నెత్తురు ద్వారా బలినర్పించే భక్తుడు పీరానికి చిహ్నమైన దేవునితో ఐక్యమౌతాడు.

భక్తుడు బలనర్పిస్తేనే సరిపోదు. దేవుడు ఆ బలిని అంగీకరించాలి. ఈ దైవాంగీకారాన్నితెలియజేయడం కోసమే కొన్ని రకాల బలుల్లో జంతువులను పీఠం మీద పూర్తిగా దహించేవాళ్ళు అలా కాలిపోయిన బలిపశువు సుగంధాన్ని విరజిమ్ముతూ దేవుని సన్నిధిని చేరుతుంది అనుకొన్నారు. దేవుడు అగ్నిద్వారా ఆ బలిని స్వీకరిస్తాడు అన్నారు. అందుకే పూర్వవేదం దేవుణ్ణి "దహించే అగ్ని" అని పిలుస్తుంది - ద్వితీ 4,24. బలిగా అర్పింపబడిన జంతువు పవిత్రమవుతుంది. అది బలినర్పించే భక్తునికి గూడ తన పావిత్ర్యాన్ని అందిస్తుంది.

ఈ భావాలను బట్టి బలిలో మూడంశాలు వున్నాయనుకోవాలి. మొదటిది, పశువుని వధించడం, రెండవది దాన్నిదేవునికి బలిగా అర్పించడం. మూడవది, దేవుడు దాన్ని అంగీకరించి భక్తుణ్ణి తనతో ఐక్యంజేసికోవడం.

దేవుడు భక్తుని బలిని అంగీకరించినపుడే అతడు దేవునితో ఐక్యమయ్యేది.బలి ముఖ్యోద్దేశం భగవంతునితో ఐక్యంగావడమేనని చెప్పాం, కాని భక్తని అంతరంగం పవిత్రంగా వుంటేనే దేవుడు అతని బలిని అంగీకరించి అతన్ని తనతో ఐక్యంజేసుకొనేది. కనుక బలిలో ఏమి అర్పించామన్నది గాదు, ఏలాంటి హృదయంతో ఆ బలి నర్చించామన్నది ముక్యం.

3. కిప్పూర్ ప్రాయశ్చిత్త బలీ - క్రీస్తు బలీ

లేవీయకాండం 16వ అధ్యాయం కిప్పూరు అనే దినాన అర్పించే ప్రాయశ్చిత్తబలిని వర్ణించింది. హెబ్రేయులు. లేఖాకారుడు క్రీస్తుబలిని ఈ ప్రాయశ్చిత్తబలితో పోల్చాడు. కనుక ఈ రెండు బలులకూ గల సామ్యాన్ని పరిశీలిద్దాం.