పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/261

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


7. మొదటి భాగంలో దేవుడు సర్వజ్ఞాని అని చెప్పాడు. ఈ రెండవ భాగంలో అతడు అంతటా ఉంటాడని చెప్తున్నాడు. కీర్తనకారుడు కవికి సహజమైన భావనాశక్తితో భగవంతుని నుండి మూడు పలాయన మార్గాలను ఊహించాడు. అవి దేవుని నుండి పైకిక్రిందికి పారిపోవడం, ప్రక్కలకు పారిపోవడం, చీకట్లో దాగుకోవడం. కాని యీ మూడు ప్రయత్నాలుకూడ వమ్మయిపోయాయి. భక్తుడు ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి తప్పించుకోలేడు.
8. దేవుని నుండి తప్పించుకొని ఆకాశానికెక్కిపోయినా, పాతాళానికి దిగిపోయినా ఆ తావుల్లోకూడ దేవుడుంటాడు. ఇది మొదటి పలాయనం.
9-10. దూరంగా తూర్పు పడమరలకు పోయినా లాభంలేదు. అక్కడా దేవుడుంటాడు. ఇది రెండవపలాయనం.
11-12. అతడు చీకట్లో దాగుకొన్నా లాభం లేక పోయింది. చీకటి మనకు చీకటిగాని, దేవునికి ప్రకాశమే ఔతుంది. అతడే దానిని చేసాడు. కనుక చీకటిలోగూడ దేవుడు భక్తుణ్ణి చూస్తాడు. ఇది మూడవ పలాయనం. ఈ విధంగా అతడు ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి తప్పించుకోలేక పోయాడు. ఆ ప్రభువు సర్వత్ర ఉండేవాడు.
13-14 మొదటి రెండు భాగాలు ముగిసాక, ఈ మూడవ భాగంలో దేవుడు అన్నీ చేయగలడని చెప్తున్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా భగవంతుడు మాతృగర్భంలో శిశువును రూపొందించే తీరును వర్ణిస్తున్నాడు. ఈ యంశాన్ని పేర్కొన్నబైబులు రచయిత ఇతడొక్కడే.
దేవుడు నరుడ్డి మాతృగర్భంలో రూపొందిస్తాడు, సాలీడు నూలుతో ಬಟ್ಟಲು నేసినట్లుగా దేవుడు పిండాన్ని అమర్చుతాడు - యోబు 10, 8-12. అతని చేతలు ఆశ్చర్యకరమైనవి, భయంకరమైనవి.
15. కీర్తనకారుడు మాతృగర్భంలో పిండంగా ఉన్నపుడు అతన్ని ఎవరు చూచారు? సొంత తల్లికూడ అతన్ని చూడలేదు. కాని ఆ దశలోనే దేవుడు అనురాగంతో అతన్ని వీక్షించాడు. ఇక్కడ మాతృగర్భమే రహస్యస్థలం.
16. భక్తుడు ఇంకా పుట్టకమునుపే దేవుడు అతనికి నిర్ణయించిన దినాలన్నీ తన గ్రంథంలో లిఖించి ఉంచుకొన్నాడు. అనగా మనం జీవించే ప్రతిరోజూ దేవునికి బాగా తెలుసునని భావం. బైబులు చాలతావుల్లో దేవుని గ్రంథాన్ని పేర్కొంటుంది - నిర్ణ 32,22. కీర్త 56,8. దర్శ 20,12. ఈ "గ్రంథం"దేవుని జ్ఞాపకశక్లేనని చెప్పాలి. మనలను గూర్చిన విషయాలన్నీ అతడు జ్ఞాపకముంచుకొంటాడని భావం.
17-18, దేవునికి మనపట్ల ప్రేమతో గూడిన ఆలోచనలుంటాయి. ఆ గారాబు తలపులు అనంతమైనవి. ఇసుక రేణువుల్లాగ లెక్కల కందనివి. అతని ప్రేమాలోచనలకు • మనం సరిగా అర్థం చేసికోలేంగూడ.