పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనగా పైన వసించే ప్రభువు క్రిందికి వచ్చి దీనులను ఆదరిస్తాడని భావం. అతడు విశ్వమంతటాను, మన హృదయంలో కూడాను ఉంటాడని భావం. పూర్వవేదంలో తండ్రిలాగే నూత్న వేదంలో క్రీస్తుకూడ స్వర్గంనుండి భూమిమీదికి దిగివచ్చాడు. అతడు తన్నుతాను శూన్యం చేసికొని, సేవకుని రూపంతాల్చి నరుడుగా జన్మించాడు- ఫిలి 2.7. మనం ఆ దేవుని "క్రిందికి దిగివచ్చే గుణాన్ని అర్థం చేచుకొని అతన్ని కీర్తించాలి. ఈ కీర్తనలో ప్రధానాంశం ఈ గుణమే. ఇంకా, మనం జీవితంలో విజయాలు వడసినప్పడుకూడ కృతజ్ఞతా భావంతో ఈ కీర్తనను జపించవచ్చు. ఆలాంటి సందర్భాల్లో దేవుడు మన జీవితంలోకికూడ దిగివచ్చాడు అనుకోవాలి.

2 ప్రభువు యిస్రాయేలు ప్రజలను కరుణించి వాళ్ళను దీనదశనుండి ఉన్నత దశకు కొనివచ్చాడు. వాళ్ళబానిసాన్ని తొలగించి వాళ్ళకు రాజులను దయచేసాడు. ఈనాడు అతడు దీనులమైన మనలనుకూడ ఎంతో ఉద్ధరిస్తుంటాడు. సాంఘికంగాను, ఆర్థికంగాను భక్తిరీత్యానుగూడ మనం గొప్పవాళ్ళంకాదు. ఐనా అతడు మనలను ఆదరించి వృద్ధిలోకి తీసుకవచ్చాడు. ప్రభువుచలవవల్ల నేడు మనం ఒక స్థాయిని అందుకొన్నాం. దీనికిగాను అతన్నిస్తుతించి కీర్తించాలి. "నా హృదయం ప్రభువుని స్తుతిస్తుంది, అతడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించాడు" అంది మరియమాత తన మహిమ గీతంలో, ఈ వాక్యాలు మనంకూడ కృతజ్ఞతాపూర్వకంగా చెప్పకోదగ్గవి. మనకు డాబూ దర్పమూ పనికిరావు. వినయమూ కృతజ్ఞతాభావమూ తగుతుంది. ప్రభువుని వినుతించి కీర్తించడం మన బాధ్యత. మనం దేవుని అద్భుత కార్యాలను ప్రకటించవలసినవాళ్ళం. జ్ఞానస్నానం ద్వారా అతడు మనలను చీకటిలోనుండి అద్భుతమైన వెలుగులోనికి తీసికొని వచ్చాడు. ఆ ప్రభువు మంచితనాన్ని మనం లోకానికి చాటిచెప్పాలి. - 1 పేత్రు 2, 9

కీర్తన - 82

పాపాన్ని వొప్పకొని మన్నింపు పొందడం

1 ప్రభు వెవని పాపములను మన్నించునో
  ఎవని తప్పిదములను తుడిచివేయునో ఆ నరుడు ధన్యుడు
2 ప్రభు వెవనిని దోషినిగా గణింపడో
  ఎవడు కపటాత్మడు కాడో, ఆ జనుడు భాగ్యవంతుడు