పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జంతు బలిని నిరసించారు. వాటికంటె హృదయారాధనం ముఖ్యమని చెప్పారు. ఆ భావాన్నే ఈ కీర్తనకారుడు కూడ వివరిస్తున్నాడు. జంతుబలు లర్పించేవాళ్లల్లో చిత్తశుద్ధి లేకపోవచ్చు. వాటితో దేవుని అనుగ్రహాన్ని కొనలేం. దేవుడు మన బలినికాక మన హృదయాన్ని చూస్తాడు. అసలు మన మర్పించే బలి ఏదో జంతువుకాకూడదు. మనమే కావాలి. పశుబలిని దేవు డంగీకరిస్తాడో లేదో తెలియదు. తన యెదుట వినయంతో పశ్చాత్తాపపడేవాణ్ణి మాత్రం అతడు తప్పక అంగీకరిస్తాడు. ఇది పూర్వవేదంలోని అతి ప్రశస్త భావాల్లో ఒకటి.

18-19 ఈ చరణాలు మొదటి కీర్తనకారునివి కావు. ప్రవాసానంతరం మరో కీర్తనకారుడు చేర్చాడు. మొదటి కీర్తనం 17వ చరణంతో ముగిసింది.

ప్రవాసానంతరం, నాశమైయున్న యెరూషలేమునూ దానిప్రాకారాలనూ పునర్నిర్మించమని భక్తుడు దేవునికి మనవి చేస్తున్నాడు. ఈ పునర్నిర్మాణం దేవుడు యిప్రాయేలీయులను మన్నించాడనడానికి నిదర్శనం.

మొదటి కీర్తనకారుడు 16-17 చరణాల్లో జంతు బలులను నిరసించాడు. ఇది రెండవ కీర్తనకారుడికి నచ్చలేదు. కనుకనే అతడు పూర్వకీర్తనకు ఈ రెండు చరణాలను చేర్చాడు. ప్రవాసం ముగిసాక యెరూషలేములో మరల బలులర్పించడం ప్రారంభించారు. కనుక జంతు బలులను అంగీకరించాలి. వట్టి తంతుగా అర్పించే బలులను అంగీకరించకపోయినా, కనీసం ఉచితమైన (భక్తిగల) బలులనైనా అంగీకరించాలి. కనుక అన్నిటిని గాకపోయినా భక్తిగల బలులనైనా దేవుడు మెచ్చుకొంటాడనీ, వాటిని అర్పింపవలసిందేననీ ఈ రెండవ కీర్తనకారుని ఉద్దేశం.

4 ప్రార్థనా భావాలు

1. ఈ కీర్తన గొప్ప పశ్చాత్తాప భావాలను సూచిస్తుంది. పాపం దేవునికి అప్రియం కలిగిస్తుంది. అది అన్నిటి కంటె ఎక్కువగా దేవునికే ద్రోహం చేస్తుంది. పవిత్రుడైన ప్రభువు పాపాన్ని సహించలేడు. మనం చిత్తశుద్ధితో మన పాపాన్ని ఒప్పకోవాలి. కేవలం పశ్చాత్తాపపడితే చాలదు. మనకు నూత్నస్వభావంకూడ అవసర.కావుననే భక్తుడు నాకు నూతనమైన మనసును ప్రసాదించు అని అర్ధించాడు. దేవుడేగాని ఈ నూత్న స్వభావాన్ని దయచేయలేడు. మన పశ్చాత్తాపంలో ఈ యంశాలను గమనించాలి.

2. ఈ కీర్తనకారునికి తన పాపాల కొరకు దీర్ఘ కాలం పశ్చాత్తాపపడే గుణం ఉంది. ఇది గొప్ప భాగ్యం. మనంకూడ దేవునినుండి ఈ వరాన్ని అడుగుకోవాలి. ఆధునిక ప్రపంచంలో పాపభీతి బొత్తిగా లేదు. నరుని నిజాయితీ మంచి పశ్చాత్తాపంలో తెలుస్తుంది. కనుక మనం జీవితాంతమూ పశ్చాత్తాప పడుతూనే ఉండాలి. పౌలు ఈలాచేసాడు - 1 తిమో 1,15-16.