పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. మనం పుట్టినప్పడే పాపంతో పడతాం. పాపపు పరిసరాల్లో పెరుగుతాం. యోబు గ్రంథం ప్రకారం నరుడు అశుధుడు - 14,4. దీన్నే నేడు జన్మపాపం అంట. కీర్తనకారునికి ఈ పేరు తెలియకపోయినా, దీని దుప్రభావం తెలుసు.

6. భగవంతుడు నరుల్లో ప్రధానంగా చిత్తశుద్ధిని కోరతాడు. మనం పాపం చేసినపుడు ఈ గుణం లోపిస్తుంది. పశ్చాత్తాపపడినపుడు దీన్ని తిరిగి పొందుతాం. ఇక్కడ భక్తుడు తన్ను జ్ఞానంతో నింపమని మనవి చేస్తున్నాడు. ఈ జ్ఞానం వివేకమనే వరం. ఈ వరంద్వారామనం తెలియక చేసిన పాపాలను గుర్తిస్తాం - కీర్త 19,12.

7. భక్తుడు 4-6 పాదాల్లో తన పాపాలను ఒప్పకొన్నాడు. ఇక వాటిని క్షమించమని దేవుణ్ణి వేడుకొంటున్నాడు. ఇక్కడ కడగడం, శుద్ధిచేయడం అనే పదాల ద్వారా తాను పాపపు కుష్ట సోకినవాడనని వ్యక్తం చేస్తున్నాడు. పాపాలు మనకు మాలిన్యాన్ని తెచ్చిపెడతాయి. దేవుడు వాటిని కడిగితే మనం మంచులా తెల్లనౌతాం - యెష 1, 18.

8. దేవుడు మన పాపాలను మన్నించడంవల్ల మనకు సంతోషోల్లాసాలు కలుగుతాయి. నరుడు పాపంచేసి దేవుని శిక్షకు గురై నలిగిపోతాడు. అనగా పాపఫలితంగా మానసిక సంతాపం, ఒకోసారి శారీరక వ్యాధులుకూడ మనలను క్రుంగదీస్తాయి. కాని పాపక్షమాపణం పొందినపుడు ఈ బెడదలన్నీ తొలగిపోయి హర్షం చెందుతాం.

9. దేవుడు తన పాపాలవైపు చూడకుండా మొగం ప్రక్కకు త్రిప్పకోవాలని వేడుకొంటున్నాడు. అనగా అతడు తన్ను మన్నించాలని భావం. పూర్వభావాలనే ఈ చరణంలో సంగ్రహంగా పునశ్చరణం చేసాడు.

10. పాపక్షమను అర్ధించిన పిదప తనకు ఆంతరంగికమైన నూత్నత్వాన్ని దయచేయమని దేవుణ్ణి అడుగుకొంటున్నాడు. పూర్వం తనది అపవిత్రమైన హృదయ.ఇప్పడు దాన్ని నిర్మలం చేయమని వేడుకొంటున్నాడు. ఈ పాదంలో “సృజించు" అనే మాట గమనింపదగ్గది. దేవుడు మొదట శూన్యంనుండి సృష్టి చేసాడు - ఆది 1.1. ఆ కార్యం దేవుడు మాత్రమే చేయగలడు. పాపపరిహారంకూడ దేవుడుమాత్రమే దయచేయగలడు. అది నూత్నసృష్టి లాంటిది.

అతడు నూత్నమూ స్థిరమూ ఐన మనస్సు కొరకు ప్రార్థిస్తున్నాడు. ఇంతవరకు అతనిది పాత మనసు, పాపపు మనసు. ఇక మీదట నూత్నస్వభావం కలగాలని కోరుకొంటున్నాడు. స్థిరమైన మనస్సు అంటే అచంచల బుద్ధితో దేవుణ్ణి సేవించే మనసు. ఎల్లకాలం పవిత్రంగా ఉండిపోయే మనస్సు. అనగా యెహెజ్మేలు ప్రవక్త అడుగుకొన్న మాంసపు గుండె - 36, 26.