పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/240

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అతడు నిత్యం దేవళంలోనే వసిస్తాడు. దేవునికి అతిధి మాత్రమేకాక, కుటుంబ సభ్యుడుకూడా ఔతాడు. అనగా దేవుని ఆదరాభిమానాలను చూరగొంటాడు. ఈలా యెల్లకాలమూ దేవుని మందిరంలో వసించడం మహాభాగ్యంకదా!

మనం కూడ దేవునిచే నడిపింపబడే గొర్రెల మందలమూ, అతని యింటి అతిథులమూ, అతని కుటుంబ సభ్యులమూ ఐతే యెంత బాగుంటుంది!

4. ప్రార్థనాభావాలు

1. పూర్వవేదం దేవునికి ప్రధానంగా ఐదుపమానాలు వాడుతుంది.

దేవుడు కాపరి, ప్రజలు అతడు మేపే మంద, దేవుడు తోటకాపు, ప్రజలు అతడు పెంచే తోట. దేవుడు గృహనిర్మాత, ప్రజలు అతడు కట్టిన గృహం. దేవుడు వరుడు, జనులు అతడు వరించిన వధువు. దేవుడు తండ్రి, ప్రజలు అతని బిడ్డలు.

ఈ యైదుపమానాలూ గొప్ప భగవదనుభూతిని కలిగించేవి. ప్రస్తుత కీర్తనం వీటిల్లో మొదటిదాన్ని వర్ణిస్తుంది. ఈ పోలికలన్నీ మల్లా నూత్నవేదంలోకికూడ వచ్చాయి. మనం కూడ నిత్యజీవితంలో వీటిని వాడుకొని భగవదనుభూతిని పొందవచ్చు.

2. "ప్రభువే నాకు కాపరి" అన్నాడు భక్తుడు. దేవుడు కాపరియై తన్ను గొర్రెనులాగ నడిపిస్తాడని యెంచాడు. గొర్రె అన్నా గొల్లవాడన్నా మన భాషలో మంచిభావాలు స్ఫురింపవు. కాని యూదులకు ఇవి పవిత్రమైన భావాలు. ఇక్కడ కాపరిచేసే పనిని పరిశీలించి చూడ్డం మంచిది. అతడు ప్రతిరోజూ, దినమంతా, గొర్రెలకోసం శ్రమిస్తాడు. తాను ముందుగా బోతూ వాటిని నడిపిస్తూంటాడు. వాటినిదూర ప్రాంతాలకు తోలుకొనిపోయి మేత మేపుతాడు, నీళ్ళు త్రాగిస్తాడు. చెట్ల నీడన పండుకోబెడతాడు. గొర్రెవట్టి పిచ్చి జంతువు. తన్నుతాను రక్షించుకోలేదు. సులభంగా క్రూరమృగాలవాత బడుతుంది. కనుక కాపరి దాన్ని జాగ్రత్తగా కాపాడుతుంటాడు. నిత్యజీవితంలో ప్రభువు తన్నింతగా పరామర్శిస్తుంటాడని భక్తుని భావం. ఆ ప్రభువు నేడు మనలను గూడ గొర్రెల మందనులాగ నడిపిస్తుంటాడు. మన భక్తిమంతమైన జీవితమంతా అతడు మనలను నడిపించడమే. మన తరుపున మనం ఆ ప్రభువు మేపే మందకు చెంది ఉండాలని ఉవ్విలల్లారుతూండాలి.

3. "నీవు నాకు విందుచేస్తావు" అన్నాడు. ఆ భక్తుడు దేవళంలో బలిభోజ్యాన్ని ఆరగించడమే ఈవిందని చెప్పాం. మన తరపున మనంకూడ రోజూ ఆ ప్రభువు