పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/239

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


2) ఆతిథ్యకారుడు

కీర్తనకారుడు మొదటి భాగంలో ప్రభువుని మంచి కాపరిగా వర్ణించాడు. ఈ వుపమానం ద్వారా దేవునిమీద తనకున్న నమ్మకాన్నీ భక్తినీ విశదం చేసాడు. ఇక, రెండవ భాగంలో ప్రభువుని ఆతిథ్యకారుణ్ణిగాను తన్ను అతని యింటికి (దేవళానికి) వచ్చిన గేస్తునిగాను వర్ణిస్తున్నాడు. మొదటి ఉపమానం కంటె గూడ అధికంగా ఈ రెండవ ఉపమానం రచయిత హృదయంలోని గాఢమైన దైవానుభూతిని వెల్లడి చేస్తుంది.

5. ప్రభువు కీర్తనకారునికి విందు చేసాడు. ఆ భక్తుడు యెరూషలేం దేవళంలో బలి అర్పించాడు. బలి ముగిసాక అతడూ అతని స్నేహితులూ కలసి దేవళంలోని నైవేద్యాన్ని సాపడ్డారు. ఈ నైవేద్యాన్నే ప్రభువు సిద్ధం చేసిన విందునుగా భావించాడు భక్తుడు. ఈ బలిభోజనం ద్వారా భగవంతునికీ భక్తునికీ దగ్గరి సంబంధం ఏర్పడుతుంది. సీనాయి కొండదగ్గర నిబంధనం చేసికొన్న పిదప మోషే అహరోనులు కొండమీది కెక్కిపోయి దేవుని సన్నిధిలో భోజనం చేసారు - నిర్గ 24, 9–11.

యూదులు విందుల్లో పరిమళ తైలాలు పూసేవాళ్ళు సీమోను ఇంటిలో విందారగించే క్రీస్తు పాదాలకు ఓ స్త్రీ అత్తరు పూసిందని వింటున్నాం - లూకా 7, 46. ఇక్కడ దేవుడు కీర్తనకారుడి శిరస్సుకి పరిమళ తైలం పూసాడు. అనగా అతని పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపాడని భావం. ఇంకా, ఆ ప్రభువు కీర్తనకారుని పానపాత్రం నిండా ద్రాక్షసారాయం పోసాడు. అనగా దేవుడతనికి అన్నపానీయాలు సమృద్ధిగా దయచేసాడని ఆర్దం.

కీర్తనకారుడి శత్రువులు కూడ అతనితోపాటు దేవళానికి వచ్చారు. అతడు దేవళంలో నైవేద్యం భుజిస్తుంటే చూచారు. కాని ప్రభువే స్వయంగా తన భక్తునికి భోజనం వడ్డిస్తుంటే, ఇక వాళ్ళేమి చేయగలరు?

6. ఈ చరణంలో "కరుణ” అంటే తల్లి తాను కన్న బిడ్డలపట్ల చూపే భావం, అనగా దేవుడు భక్తుణ్ణి కన్నబిడ్డలా ఆదరిస్తాడని భావం, “ఉపకారం" అంటే కుటుంబ సభ్యులు ఒకరికొకరు చేసికొనే మేలు. అనగా దేవుడు భక్తుణ్ణి తన కుటుంబ సభ్యుణ్ణిగా, తన బంధువునిగా ఎంచుతాడని భావం. ఇంతవరకు శత్రువులు కీర్తనకారుడి వెంటబడుతూవచ్చారు. కాని యికమీదట దేవుని కరుణా ఉపకారమూ బంటుల్లా, దేవదూతల్లా అతనివెంట నడచి వస్తాయి. అతన్ని భద్రంగా దేవళానికి తీసికొని వస్తాయి.

ఇంతవరకు అతడు పాస్కొత్సవం మొదలైన పండుగల్లో దేవళానికి వస్తున్నాడు. ఓ వారంపాటు దేవళంలో అతిథిగా గడిపి మళ్లా యింటికి పోతున్నాడు. ఇకమీదట