పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/238

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఈ మొదటి భాగంలో చాల పాదాలకు గొర్రెపరంగాను కీర్తనకారుని పరంగానుకూడ అర్థం చెప్పవచ్చు. గొర్రెపరంగా తీసికొంటే, అది గడ్డిమేసి, నీళ్ళత్రాగి శాంతిని పొందుతుంది. కీర్తనకారుని పరంగా తీసికొంటే, అతడు యెరూషలేం దేవళంలోనికి వచ్చి ప్రభువుని దర్శించి శాంతిని పొందుతాడు. దేవాలయం శాంతికి నిలయం. కీర్తనకారుడు స్వయంగా దేవాలయంలో ఈ కీర్తనను ఆలాపించి ఉంటాడని చెప్పాం.

3. గొర్రెలు చక్కగామేసి, నీళ్లు తాగి నీడపట్టున విశ్రమించి సేదతీర్చుకొంటాయి. కీర్తనకారుని పరంగా తీసుకొంటే అతడు దేవాలయంలో నైవేద్యం ఆరగించి బడలికలు తీర్చుకొంటాడు.

ప్రభువు వాగ్హానం చేసాడు. అనగా రక్షిస్తానని మాట యిచ్చాడు. ఆ మాట ప్రకారం అతడు గొర్రెలను వంకరటింకర త్రోవల్లో కాక తిన్నని త్రోవలో నడిపిస్తాడు. కీర్తనకారుని పరంగా తీసికొంటే, ప్రభువు అతన్ని ధర్మమార్గంలో నడిపిస్తాడు. ఇక్కడ ధర్మమార్గమంటే మోషే ధర్మశాస్త్రం ఆదేశించే మార్గం. అనగా కీర్తనకారుడు ధర్మశాస్త్రంలోని కట్టడల ప్రకారం జీవించేలా ప్రభువు తోడ్పడ్డాడని భావం. శత్రువులు నిందించినట్లుగా అతడు విగ్రహాలను కొల్చి అధర్మ మార్గంలో నడవలేదు. విరోధులు అతనిమీద మోపిన నిందలన్నీ తొలగిపోయాయి.

4. గాధాంధకారపు లోయ అంటే అపాయాలకు నిలయమైన తావు. గొర్రెలు మేసి సాయంకాలం ఇంటికి వచ్చేపుడు అపాయకరమైన లోయల గుండా రావాలి. అక్కడ తోడేళ్లు పులులు దుమ్ములగొండెలు మొదలైన వన్యమృగాలు కాచుకొని ఉంటాయి. అవి మందమీద బడి ఏ గొర్రెనో ఎత్తుకొనిపోతాయి. కనుక ఈ లోయగుండా వచ్చేపుడు కాపరి గొర్రెలను జాగ్రత్తగా సంరక్షిస్తాడు. తాను వాటికి తోడుగా, అండగా దండగా ఉంటాడు.

ఇక్కడ బడితె, కోల అనే పదాల విశేషార్ధాన్ని గమనించాలి. ఆనాటి పాలస్తీనా కాపరులు గొర్రెలను పొలానికి తోలుకొని పోయేపుడు రెండు కర్రలను తీసికొని పోయేవాళ్లు. ఒక కర్ర కురచగా, లావుగా ఉంటుంది. దాన్ని నడుంమీద గుదికొయ్యలా కట్టుకొని పోయేవాళ్ళు తోడేలు మొదలైన క్రూర మృగాలు తారసిల్లినపుడు దానితో వాటిని చావబాదేవాళ్లు. ఇదే “బడిత", మరొక సన్నని కర్రను గూడ చేతబట్టుకొని పోయేవాళ్లు, దానితో గొర్రెలను అదిలించేవాళ్లు. ఇదే "కోల". ఈ బడితతోను కోలతోను కాపరి గొర్రెలను సురక్షితంగా ఇంటికి తోలుకొని వచ్చేవాడు.

ఈ చరణాన్నే కీర్తనకారుని పరంగా తీసికొంటే అతడు పూర్వం ఎన్నో అపాయకరమైన త్రోవల్లో నడచాడు. శత్రువులు అతనిమీద నిందలు మోపి పీడించారు. ఐనా అతడు ఏ ప్రమాదానికీ జంకడు. ప్రభువే అతని తోడుగా ఉంటాడు.