పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హృదయ శాంతిని దయచేసింది. భక్తి విశ్వాసాలు పట్టించింది. నేడు మనంకూడ ఈ గీతాన్ని శ్రద్ధతో మననం చేసికొని గొప్ప దైవానుభూతిని పొందవచ్చు

2. విభజనం


ఈ కీర్తనలో రెండు భాగాలున్నాయి. అవి
1-4 ప్రభువు మంచి కాపరి
5 - 6 అతడు ఆతిథ్యకారుడు

3. వివరణం

1) కాపరి

1. కీర్తనకారుడు ఈ మొదటి ఉపమానంలో దేవుడ్డి మంచి కాపరినిగాను తన్ను గొర్రెనుగాను వర్ణిస్తున్నాడు. పూర్వవేదంలో దేవుడు కాపరియై యిస్రాయేలనే మందను ఎడారిగుండా నడిపించుకొనిపోయాడు. ప్రజలు కనాను మండలంలో స్థిరపడిన పిదప కొన్నాళ్ళ రాజులు కాపరులై వాళ్ళను పరిపాలించారు. కాని యీ రాజులు అయోగ్యులు కాగా ప్రభువు తానే మళ్లావాళ్ళకు కాపరినౌతానని వాగ్దానం చేసాడు. తన ప్రతినిధియైన మెస్సీయా కాపరియై వాళ్లను పరిపాలిస్తాడని గూడ చెప్పాడు. కనుకనే ఆ మెస్సియా నేను మంచి కాపరినని చెప్పకొన్నాడు. కాపరి అనేది పూర్వవేదంలో మాటిమాటికి తగిలే భావం. కాపరి శబ్దం యూదులకు ఎంతో ప్రీతిపాత్రమైంది. రక్షకుడు, రాజు, నాయకుడు అని ఈ పదానికి అర్థాలు.

ప్రభువనే కాపరి మేపే గొర్రె కీర్తనకారుడు. కనుక అతనికి ఏ కొదవా లేదు. ఏ కొరతాలేక సురక్షితంగా జీవిస్తాడు.

2. కీర్తనకారుడు తన్నుగొర్రెనుగా భావించుకొని చెప్తున్నాడు. మంచి కాపరియైన ప్రభువు అతన్ని పచ్చికబీళ్లల్లోనికి తోలుకొనిపోతాడు. పాలస్తీనా దేశం మన దేశంలాగే ఉష్ణదేశం. తరచుగా బెట్టగా ఉంటుంది. కాపరులు మందలను కొండల్లోనికి కొన్నిమైళ్లు దూరంతోలుకొనిపోతేనేగాని పచ్చిక పట్టలు తగలవు. అక్కడ మంద కడుపునిండ మేస్తుంది. మధ్యాహ్నపు టెండలో కాపరి గొర్రెలను చెట్ల నీడన పండుకోబెడతాడు. అవి కాసేపు విశ్రమిస్తాయి.

కొంతకాలం మేసాక అతడు గొర్రెలను ఏ మడుగు దగ్గరికో తోలుకొనిపోతాడు, అవి నీళ్ళ త్రాగి విశ్రాంతి పొందుతాయి.