పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. రచనాకాలం

కీర్తనలను క్రీ.పూ. 10వ శతాబ్దం నుండి రెండవ శతాబ్దం వరకు వ్రాస్తూ వచ్చారు. కనుక ఈ గ్రంథ రచన 800 ఏండ్ల పొడుగున కొనసాగింది. మొదటలో దావీదు రాజు కొన్ని కీర్తనలు కట్టాడు. కొన్నిటిని సేకరించాడు. అధిక భాగం కీర్తనలను రాజుల కాలంలోనే వ్రాసారు. బాబిలోనియా ప్రవాసానంతరంగూడ కొన్నిటిని రచించారు.

4. హీబ్రూ కవిత్వం

మొదటి కీర్తనం వచనంలో వుంది. తతిమ్మావన్నీ పద్యరూపంలో వున్నాయి. కాని మన భాషల్లోలాగ హీబ్రూ భాషలో ఖండితమైన ఛందోనియమాలు లేవు. తరచుగా చెప్పిన భావాన్నే రెండుసార్లు చెప్పి, రెండు పాదాల మధ్య సమానమైన తూగును పాటించేవాళ్ళు. వీటినే సమాంతర పాదాలు అంటారు. ఉదాహరణకు

"నీ వాక్యం నా పాదాలకు దీపం
నా త్రోవకు వెలుగు” - కీర్త 119, 105,

ఇక్కడ మొదటి పాదమూ రెండవ పాదమూగూడ భిన్నపదాలతో ఒకే భావాన్ని చెప్తాయి. రెండు పాదాలకూ ఓ విధమైన తూగు వుంది. హీబ్రూ కవిత్వంలో ఈ యానురూప్య పద్ధతి ప్రచురంగా గోచరిస్తుంది.

5. దేవాలయ ప్రాముఖ్యం

కొందరు భక్తులు వ్యక్తిగతంగా కొన్ని కీర్తనలు వ్రాసికొని వుంటారు. కాని అధికశాతం కీర్తనలను యెరూషలేం దేవాలయంలో ఆరాధన సమయంలో పాడ్డానికే వ్రాసారు. అన్ని కీర్తనలను చివరకు దేవాలయంలోనే పదిలపరచారు. కీర్తనల గ్రంథం దేవాలయంలో నిర్వహించిన ఆరాధనలోను, అక్కడ అర్పించిన బలుల్లోను భక్తులకు భగవంతుడు అనుభవానికి వచ్చిన తీరును వర్ణిస్తుంది. కనుక దేవాలయాన్ని లెక్కలోకి తీసికోందే కీర్తనలను అర్థం చేసికోలేం. వాటి వనికీ మనకీగూడ దేవాలయంతో ముడిపడి వుంది.

ఈ పాటలను విశేషంగా రెండవ దేవాలయారాధనంలో వాడారు. యూదులు పాస్మపండుగను గుడారాల పండుగను పెంతెకోస్తు పండుగను చేసికోవడానికి ఏటేట యెరూషలేం యాత్ర చేసేవాళ్ళు ఆ వుత్సవాల్లోనే ఈ కీర్తనలను ఎక్కువగా పాడేవాళ్ళు దేవాలయంలో వీటిని గానం చేయటానికి లేవీయుల బృందం ప్రత్యేకంగా వుండేది.