పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేదవాక్యాలు ఈలా వుండవచ్చు. "ప్రభువు మంచివాడు కనుక అతన్ని స్తుతిద్దాం" “సమాధానంతో వెళ్ళి నిన్ను రక్షించిన ప్రభువు అద్భుతకార్యాలను లోకానికి వెల్లడిచేయి" - మార్కు 5,19.

కడన గురువు విశ్వాసిని సమాధానంతో వెళ్ళమని చెప్తారు. విశ్వాసి తాను పొందిన హృదయ పరివర్తనాన్ని రోజువారి జీవితంలో కొనసాగించుకోవాలి. విశేషంగా అతడు ప్రేమజీవితం జీవించాలి.

దేవుడు తన పాపాలను మన్నించి తనకు రక్షణం దయచేసాడు గనుక భక్తుడు తానూ రోజువారి జీవితంలో తోడివారిని మన్నిస్తూండాలి. “మిూరు ఒకరిపట్ల ఒకరు దయతోను జాలితోను ప్రవర్తించండి. దేవుడు క్రీస్తుద్వారా మిమ్మక్షమించినట్లే మిూరు ఒకరినొకరు క్షమించండి" - ఎఫె 4,32. విశ్వాసులు నిత్యజీవితంలో ఈ క్షమాగుణాన్ని ప్రదర్శింపవలసిన సందర్భాలు ఎన్నయినా తగులుతాయి.

ఇక, మనం చేసిన పాపోచ్చారణం మనలను ప్రేషిత సేవకు పరికొల్పాలి గూడ. ప్రభువు మన పాపాలను మన్నించి మనకు ఆనందాన్నీ శాంతినీ దయచేస్తాడు. అలాంటి ప్రభువుని మనం ఇతరులకు గూడ ప్రకటించాలి. మనకు చేతనైన పద్ధతిలో మనం అతన్ని ఇతరులకు ఎరుకపరచాలి. కనుకనే నిన్ను"రక్షించిన దేవుని అద్భుత కార్యాలను లోకానికి వెల్లడిచేయి" అనే వేదవాక్యాన్ని ఇక్కడ స్మరించుకోవడం జరుగుతూంది.

పాపోచ్చారణ సంస్కారానికి వెళ్ళాలంటే కొంతమందికి బాధగా వుంటుంది. ఆ సంస్కారంలో పాల్గొనాలంటే ఏదో శిక్ష ననుభవించినట్లుగా వుంటుంది. కాని ఈలా భావించడం పొరపాటు. ఈ క్రియద్వారా పాపపరిహారాన్ని పొందుతాం గనుక యిది యథార్థంగా మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకా, దీనివలన తోడినరులపట్ల మనకు గల అనిష్టభావాలు తొలగిపోతాయి. ప్రేమభావాలు ఏర్పడతాయి. కనుక విశ్వాసులు భక్తి విశ్వాసాలతో ఈ సంస్కారాన్ని స్వీకరిస్తూండాలి.

ప్రార్ధనా భావాలు


1. ఇటీవల ప్రచారంలోకి వచ్చిన నూత్న పాపోచ్చారణ విధిలో వాక్యపఠనానికి చాల ప్రాముఖ్యం ఇచ్చారు. భక్తుడు పాపోచ్చారణం చేసికోకముందు దైవవాక్యాన్ని పఠించి భక్తితో ధ్యానం చేసికోవాలి. హృదయపరివర్తనానికి తోడ్పడే వాక్యాలను ఎన్నుకొని మరీ చదువుకోవాలి. ఈలాంటి వాక్యాల జాబితాను ఈ గ్రంధాంతంలో "బైబులు అవలోకనాలు" అనే మకుటం క్రింద పొందుపరచాం.