పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేదశాస్తాన్ని చదువుకొని వుండడంద్వారాను, భక్తితో ప్రార్ధనం చేసికొని వుండడంద్వారాను, అతడు న్యాయాధిపతిగా తాను నిర్వహించే బాధ్యతలను చక్కగా అర్థంచేసికోవాలి. పైగాపవిత్రాత్మ అపవిత్రాత్మ నరుల హృదయాల్లో పనిచేసే తీరుగూడ అతనికి క్షుణ్ణంగా తెలిసివుండాలి. ఈ వివేచనం పవిత్రాత్మ అనుగ్రహంవల్ల అతనికి సిద్ధిస్తుంది–10. కనుక గురువు తన తరపున తాను భక్తిశ్రద్ధలతో మెలుగుతూ విశ్వాసులు ఈ సంస్కారంద్వారా సత్ఫలితాన్ని పొందేలా చూడాలి.

7. ప్రాయశ్చిత్తం

పశ్చాత్తాపమూ పాపోచ్చారణాల తర్వాత ప్రాయశ్చిత్తం వస్తుంది. మనం ప్రాయశ్చిత్తాన్ని ఎందుకు చెల్లించాలో బాగా అర్థం చేసికొని వుండాలి. ఈ యధ్యాయంలోనాల్గంశాలు పరిశీలిద్దాం.

1. ప్రాయశ్చిత్త భావం

మన పాపాలకు గురువు విధించే అపరాధాన్ని చెల్లించడమే ప్రాయశ్చిత్తం. మనమే గనుక మన పాపాలకు చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడితే, ఆ పాపాలద్వారా మనం మనసునొప్పించిన దేవునికి పరిహారం చెల్లిస్తాం. అదే ప్రాయశ్చిత్తం. పాపోచ్చారణంలో ప్రాయశ్చిత్తం అతి ముఖ్యమైన అంశం కాదు. కాని అవసరమైంది.

మన పాపంవల్ల భగవంతుడు కోపపడతాడనీ, ఆ కోపాన్ని తొలగించడానికి ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాలనీ భావించకూడదు. యథార్థంగా భగవంతుడు మన పాపాలకు కోపపడడూ, బాధపడడూ, "మనం పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయాడు అంటే దేవునికి మనపట్ల ప్రేమ వుందని అనుకోవాలి" - రోమా 5,8. నిజానికి ప్రాయశ్చిత్తం ద్వారా జరిగేదేమిటంటే, మన జీవితాన్ని చక్కదిద్దుకొంటాం. మన రోగానికి చికిత్స చేసికొంటాం.

మన పశ్చాత్తాపంద్వారా పాపోచ్చారణంద్వారా మనపాపాలకు మన్నింపు పొందుతాం. మనకు రక్షణం లభిస్తుంది. ఇపుడు ప్రాయశ్చిత్త కర్మద్వారా పూర్వపు పాపజీవితాన్నుండి వైదొలగి క్రొత్త జీవితానికి పూనుకొంటాం.

ప్రాయశ్చిత్తాన్ని చెల్లించడం ద్వారా ఏమి సాధిస్తాం? పాపోచ్చారణం ద్వారా నిత్యశిక్ష (నరకశిక్ష) తొలగుతుందేగాని అనిత్యశిక్ష తొలగదని చెప్పాం. అనిత్యశిక్ష అంటే మనం చేసిన పాపానికి కొన్ని బాధలు అనుభవించడం అనికూడ చెప్పాం. ఈ యనిత్యశిక్షను ఈ భూమిమిదగాని లేక ఉత్తరించే స్థలంలోగాని తీర్చుకొన్న పిదపనే మనకు మోక్షప్రాప్తి