పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/198

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పాపాత్ములకొరకు, ఆరోగ్యవంతులకొరకు గాక రోగులకొరకు, ఆ తండ్రి తన కుమారుణ్ణి పంపాడు. ఆ క్రీస్తు సిలువపై మరణించి మన పాపాలకు విముక్తి దయచేసాడు. కనుక మనం ఈ సంస్కారంలో తండ్రి దయను కొనియాడతాం. దేవుని దగ్గరికివచ్చి మిరు గూడ పాపపరిహారం పొందండని ఇతరులను కూడ ఆహ్వానిస్తాం.

కావున పాపోచ్చారణం చేయడమంటే ఒట్టినే పాపాలను ఏకరువుపెట్టి రావడంగాదు. ఆ సంస్కారంద్వారా మనం ప్రభువును కరుణను కీర్తిస్తాం. అతని న్యాయాన్నీ తీర్పునీ అంగీకరిస్తాం. కనుక పాపోచ్చారణమంటే భగవత్ సంకీర్తనం. మన పాపం భగవంతుణ్ణి అవమానపరచినట్లే మన పాపోచ్చారణం ఆ ప్రభుని కీర్తిస్తుంది.

2. మానసిక లాభాలు

పాపోచ్చారణంవల్ల చాలా మానసిక లాభాలను గడిస్తాం. కొన్నిటిని పరిశీలిద్దాం. భగవంతుడు వెలుగు. అతనిలో చీకటి వుండదు 1యేూహా 1,5. కాని పాపి అంధకారమయడు. అతనికి వెలుగు నచ్చదు, కనుకనే వెలుగు చెంతకు రాడు - యోహా 3,20, అతడు తన పాపాలను కప్పిపుచ్చుకొంటాడు. తన రహస్యపాపాలనే గాక బహిరంగ పాపాలను గూడ దాచిపెట్టుకోగోరతాడు. కాని మనం వినయంతో దేవుని యెదుటా శ్రీసభ యెదుటా మన పాపాలను ఒప్పకొన్నపుడు మనలోని చీకటిని పారదోలుతాం. అప్పడు భగవంతుని ప్రేమా, సత్యమూ, ప్రకాశమూ, మన హృదయాల్లో చోటు చేసికొంటాయి. మన పాపాలను ఒప్పకొన్నాం గనుక మన వేషధారితనమూ నటనా అంతరిస్తాయి. అంధకారమయులమైన మనం జ్యోతిర్మయ మానవులంగా తయారౌతాం.

పాపం చేసిన నరునికి ఆ పాపాన్ని ఒప్పకోవాలనే తపన వుంటుంది. అలా ఒప్పకోవడంవల్ల హృదయభారం తగ్గి మనసు తేలికపడుతుంది. అందుకే ప్రాచీన కాలంలో పాపులు గురువు దొరకనపుడు గృహస్తులకు గూడ పాపోచ్చారణం చేసేవాళ్ళని చెప్పాం. ఏలాగో వోలాగు హృదయభారాన్ని వదిలించుకోవాలికదా! గృహస్థులకు చేసిన పాపోచ్చారణం సంస్కారంకాదు. ఐనా ఈ ప్రక్రియలో నరుడు తోడి నరుని ద్వారా భగవంతుణ్ణి చేరే ప్రయత్నం చేస్తున్నాడు అని భావించాలి.

పశ్చాత్తాపపడిన పాపి తన పశ్చాత్తాపాన్ని మాటలద్వారా ఇతరులకు తెలియజేయగోరుతాడు. పాపోచ్చారణం వల్ల ఈ యవసరం తీరుతుంది. పైగా పాపోచ్చారణంలో గురువు పాపిని ఆదరంతో అంగీకరిస్తాడు. దీనిద్వారా పాపికి ఊరటా సంతృప్తి కలుగుతాయి. అతనికి తన పాపాలు తొలగిపోయాయనే నమ్మకం కలుగుతుంది. అందుకే ఒకోసారి పాపోచ్చారణానంతరం మన హృదయంలో ఓ విధమైన ఆనందమూ ఉత్సాహమూ పుట్టుకవస్తాయి.