పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక్కసారి మాత్రమే పొందవచ్చు. కాని ఆ సంస్కారాన్ని పొందిన తరువాత పాపం చేసిన వాళ్ళకి మన్నింపు ఏలా లభిస్తుంది? పాపోచ్చారణం ద్వారానే. కనుకనే శ్రీసభ ఈ పాపోచ్చారణాన్ని గూడ సంస్కారాల్లో చేర్చింది.

ఇక, ఈ పాపోచ్చారణం ద్వారా గూడ మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, శ్రీసభ కృషి అంతాగూడ దేవుణ్ణి ఆరాధించడానికే. శ్రీసభలోని దివ్యశక్తి అంతాగూడ ఈ యారాధనం నుండే లభిస్తుంది. పాపోచ్చారణం ఈ యారాధనంలో ఒక భాగం. దానిద్వారా మనం దేవుని దయనూ కరుణనూ లోకానికి వెల్లడిచేస్తాం. అలాంటి కరుణగల భగవంతుణ్ణి లోకంముందు స్తుతించి కీర్తిస్తాం. ఇతరులు కూడ ఆ కరుణగల దేవుని సన్నిధిలోకి రావాలని హెచ్చరిస్తాం.

వాటికన్ మహాసభ "పాపోచ్చారణం చేసేవాళ్ళకు శ్రీసభతో పునస్సమాధానం కలుగుతుంది. ఏ శ్రీసభనైతే వాళ్లు పూర్వం తమ పాపాలద్వారా నొప్పించారో, ఏ శ్రీసభ వాళ్ళ పరివర్తనం కొరకు తన ప్రార్థనలు అర్పిస్తుందో, ఆ పవిత్ర సమాజంతో పాపోచ్చారణం చేసేవాళ్ళకు పునర్మెత్రి కలుగుతుంది" అని చెప్తుంది. కనుక పాపోచ్చారణం పాపి వ్యక్తిగతమైన క్రియ కాదు. శ్రీసభతో సంబంధించింది. శ్రీసభ ఆరాధనంలో బహిరంగంగా పాలు పొందేది. దానిద్వారా మనం మన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటిస్తాం.

పాపోచ్చారణంలో మనం ఉత్తాన క్రీస్తుని కలసికొంటాం. ఉత్తానప్రభువు శాంతి సమాధానాలకూ సంతోషానందాలకూ నిలయమైనవాడు. ఉత్తానానంతరం అతడు శిష్యులకు దర్శనమిచ్చినపుడెల్ల "మికు సమాధానం కలగాలి" అని చెప్తుండేవాడు. కనుక ఈ సంస్కారాన్ని పొందినపుడు మన హృదయంలో శాంతీ సంతోషమూ నెలకొనాలి. మనం విచారంతో గాదు, సంతోషంతో దీనిలో పాల్గొనాలి. ఒక్క పాపి పరివర్తనం చెందితే పరలోకంలో గూడ ఆనందం కలుగుతుందని చెప్తుంది లూకా సువార్త 15:7.

ప్రార్ధనా భావాలు

1. మనకు పరివర్తనం కలిగించేది దేవుడేనని చెపూ అగస్తీను భక్తుడు ఈ క్రింది వుపమానం చెప్పాడు. పావురం గోపురం చుటూ తిరుగుతూ దానిలో ఎక్కడైనా రంధ్రం కన్పిస్తుందేమోనని జాగ్రత్తగా పరిశీలించి చూస్తుంది. ఎక్కడైనా బెజ్జం కన్పించగానే సంతోషంతో దానిలోదూరి గూడుకట్టుకొంటుంది. అలాగే భగవంతుడు కూడ పాపి హృదయం చుటూ తిరుగుతూ అతని మనసులోకి ఏలా ప్రవేశించాలా అని జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు. చివరికి ఏలాగో ఓలాగు అతని యెడదలోకి ప్రవేశించి పరివర్తనం పుట్టిస్తాడు.