పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూడ ఉద్దేశించాడు. ఆ సమాజమే శ్రీసభ, కనుక మనం పాపం చేసినప్పడు దేవునికి ఎంతద్రోహం చేస్తామో శ్రీసభకు గూడ అంతద్రోహం చేస్తాం. ఇక పాపోచ్చారణం ద్వారా దేవునితో రాజీపడినట్లే శ్రీసభతోగూడా రాజీపడతాం. ఈ భావాన్ని సూచిస్తూ శ్రీసభ ప్రతినిధియైన గురువు నెదుట మన పాపాలను ఒప్పకొని పశ్చాత్తాపపడతాం.

ఇంకా పశ్చాత్తాపమూ పరివర్తనమూ అనేవి కేవలం మన కృషివల్ల సిద్ధించేవి మాత్రమే కాదు. శ్రీసభ కూడ తన ప్రార్ధనతో, తన భక్తితో ఈ వరాలను మనకు సంపాదించి పెడుతుంది. ఎందరో భక్తిమంతుల ప్రార్ధనా ఫలితంగా మనకు పశ్చాత్తాపం పడుతుంది. ఇందువల్ల గూడ మనం శ్రీసభ ప్రతినిధి యెదుట మన దోషాలను ఒప్పకొంటాం.

మన పశ్చాత్తాపం శ్రీసభలోని ఇతర సభ్యులకు గూడ మేలు చేస్తుంది. మన పరివర్తనం ద్వారా వాళ్ళ హృదయాలు కూడా మారతాయి. వాళ్లుకూడ దేవునివద్దకు తిరిగివస్తారు. ఫలితంగా నరుల హృదయాల్లో దైవరాజ్యం నెలకొని విస్తరిల్లుతుంది. దేవుడు తాను కోరుకొన్నట్లుగా ఈ లోకాన్నంతటినీ రక్షింపగల్లుతాడు. శ్రీసభ ప్రతినిధియైన గురువు నెదుట మన పాపాలను ఉచ్చరించినపుడు మనం ఆ సభకు మేలు చేస్తున్నామని సూచిస్తాం.

అసలు మనంచేసే పాపోచ్చారణాన్ని వ్యక్తిగతమైన సంస్కారంగా భావించకూడదు. ప్రతివ్యక్తి పాపోచ్చారణమూ శ్రీసభ అంతటి పాపోచ్చారణంకూడ, మన పాపోచ్చారణం ద్వారా క్రీస్తు వధువైన శ్రీసభ మరింత పవిత్రురాలు ఔతుంది. ఆమె ఏ కలంకమూ లేకుండా నిర్దోషంగా నిర్మలంగా తన వరుడైన క్రీస్తుమందు నిలబడ్డానికి యోగ్యురాలు అవుతుంది - ఎఫె 5,27. ఈ శ్రీసభ తన బిడ్డలమైన మన పాపాలవల్ల ఇంకా పూర్ణశోభను పొందలేకుండా వుంది. ఆమె తన బిడ్డలమైన మనం పాపంతో నిండివుండడాన్ని చూచి దుఃఖిస్తుంది. మనలను పశ్చాత్తాపపడమని హెచ్చరిస్తుంది. తన ప్రార్థనలతో మనకు పశ్చాత్తాప భాగ్యాన్ని సంపాదించిపెడుతుంది. మనం దేవుని వద్దకు మరలివచ్చినపుడు తాను ఎంతో ఆనందిస్తుంది. కనుక మన పాపోచ్చారణం ద్వారా శ్రీసభ అంతా పవిత్రమౌతుంది. శ్రీసభ అంతా దేవునితో పునస్సమాధానం కలిగించుకొని అతని సన్నిధిలోకి రాగలుగుతుంది. ఫలితంగా ఆ సభ జ్ఞానస్నానం పొందని అన్యమతస్తులకు గూడ పవిత్రురాలుగా కన్పిస్తుంది. వాళూ ఆ సభలో చేరాలని అభిలషిస్తారు.

1973లో వెలువడిన నూత్న పాపోచ్చారణ విధి ఈలా చెప్తుంది. "నరులు తరచుగా చెడ్డపనుల్లో ఒకరికొకరు సహాయం చేసికొంటారు. అలాగే పరివర్తనం చెందినపుడు గూడ వాళ్లు ఒకరికొకరు సహాయం చేసికొంటారు. వాళ్లు క్రీస్తు అనుగ్రహం ద్వారా పాపాన్నుండి విముక్తి పొంది, మంచి హృదయం కల ఇతర జనులతో గూడ కలసి, న్యాయాన్నీ శాంతినీ స్థాపిస్తారు" - 5.