పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్థానక్రీస్తు తండ్రి నుండి ఆత్మను పొంది ఆ దివ్యశక్తిని మనందరి మిూదా కుమ్మరించాడు. నేడు మనకు జీవమూ పవిత్రతా ఐక్యతా సిద్ధించేది ఆత్మద్వారానే. ఆ యాత్మడు ఇప్పడు నరులందరినీ క్రీస్తు పేరుమిూదిగా ఐక్యం చేసి ఒక్కసమాజంగా ఏర్పరుస్తాడు. ఆ సమాజమే శ్రీసభ పూర్వం బాబెలు గోపురం కట్టినపుడు ప్రజలు విడిపోయారు - ఆది 11,8-9, కానీ ఇప్పడీయాత్మ ద్వారా-జనులు ఐక్యమౌతారు. అన్నిసంస్కారాల్లోను ఆత్మపనిచేస్తుంది. ఉదాహరణకు పూజలో గురువు ఆత్మను ఆవాహనం చేసి పీఠం మీది అప్పరసాలను ఆశీర్వదించి వాటిని క్రీస్తు శరీర రక్తాలనుగా మార్చమని ప్రార్ధిస్తాడు. అలాగే జరుగుతుంది. పాపోచ్చారణ సంస్కారంలో గూడ పనిచేసేది ఆత్మే ఆ సంస్కారం ద్వారా దేవునితోను తోడి ప్రజలతోను మనకు పునస్సమాధానం కలిగించేది ఆత్మే.

పశ్చాత్తాపపడాలనే కోరికను మొదట మన హృదయంలో పుట్టించేది ఆత్మడే ఆ దివ్యశక్తి ద్వారానే మనం మన తప్పిదాలను పరితాపం చెందుతాం. ఈ పరితాపం ద్వారా మన హృదయాలను మార్చి మనకు క్రొత్త యెడదను దయచేసేది కూడా ఆత్మే కనుకనే ప్రభువు "నేను మికు క్రొత్త హృదయాన్నీ క్రొత్త ఆత్మనూ ప్రసాదిస్తాను" అన్నాడు - యోహె 36,26. ఈలా క్రొత్త గుండెను పొందడం ద్వారా నరుడు శారీరకేచ్ఛలను జయించి ఆత్మప్రబోధం ప్రకారం జీవించడం మొదలిడతాడు. ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ మొదలైన ఆత్మ ఫలాలను సాధిస్తాడు - గల 5,22-23.

విశ్వాసులు పాపోచ్చారణ సంస్కారంలో తమ హృదయాన్ని ఆత్మకు అర్పించుకోవాలి. ఆ హృదయాన్ని మార్చమని ఆ దైవవ్యక్తిని అడుక్కోవాలి, హృదయంలోని గాయాలను మాన్పమనీ, పిశాచ ప్రభావం నుండి విముక్తి దయచేయమనీ, పిశాచ శోధనలను జయించే శక్తిని దయచేయమనీ, దేవునితోను తోడి నరులతోను ఐక్యమై ప్రేమజీవితం జీవించే భాగ్యాన్ని ప్రసాదించమనీ ఆత్మను వేడుకోవాలి. ఆ దివ్యాత్మ ద్వారా భక్తులు తప్పకుండా హృదయశుద్ధిని పొందుతారు.

5. శ్రీసభద్వారా పాపపరిహారం

దేవుడే నేరుగా మన పాపాలు పరిహరించవచ్చు కదా. వాటిని గురువుతో చెప్పకోవడం దేనికి అని చాలమంది అడుగుతూంటారు. గురువును ఓ ప్రత్యేక వ్యక్తినిగాగాక క్ర్తెస్తవ సమాజమైన శ్రీసభకు ప్రాతినిధ్యం వహించేవాణ్ణిగా తీసికోవాలి. క్రీస్తు సమాజంతో మనకు అవినాభావ సంబంధముందని గుర్తించాలి. మన పాపంలో సామూహిక గుణంకూడ వుంటుంది. మనం పాపంద్వారా దేవుణ్ణి మాత్రమే కాదు తోడిజనాన్ని గూడ బాధిస్తాం. " దేవుడు నరుడ్డి తనకు పోలికగా మాత్రమే సృజింపలేదు. అతడు ఓ సమాజంలో జీవించాలని