పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కొనసాగాలని అతని కోరిక. కనుకనే అతడు కడపటి విందులో "ఈ బలిని నా జ్ఞాపకార్థంగా మీ మధ్యలో కొనసాగించుకొంటూ పొండి" అన్నాడు - లూకా 22,19.

ఇక అతని సిలువబలిని మన మధ్యలో కానసాగించే మార్గం ఏమిటి? అసలు అది రక్తపాతంతో గూడిన బలి. దాన్ని మనం ఏలా పునశ్చరణం చేయగలం? పైగా మనం ఆ బలిని ప్రస్తుతః పునశ్చరణం చేయలేం. పూర్వవేదంలో యాజకులైతే ఏటేటా ప్రాయశ్చిత్తబలులు అర్పించారు. క్రీస్తు ఈలా చాలాసారులు బలులు అర్పించలేదు. అతని బలి ఒకే వొకటి, ఒక్కసారి మాత్రమే అర్పించబడింది - హెబ్రే 9,25-27. ఈలాంటి ఏకైక బలిని మనం మళ్ళా పునశ్చరణం చేయలేంగదా!

కనుక క్రీస్తే ఆ సిలువబలిని మన మధ్యలో కొనసాగించే మార్గం వెదికాడు. ఆ బలిని సాంకేతికంగా, రొట్టె ద్రాక్షసారాయాల రూపంలో, ఒకరోజు ముందుగానే అర్పించాడు. అదే కడపటి విందు. ఈ విందుబలి ఆ సిలువ బలికి సూచనం. ఈ విందు బలిని మనం ఎన్నిసార్లయినా పునశ్చరణం చేసికోవచ్చు. అలా చేసినపుడల్లా సిలువ బలిని పునశ్చరణం చేసినట్లే అవుతుంది. కనుక క్రీస్తు అంతిమ భోజనం ద్వారా మనం సిలువ బలిని పునశ్చరణం చేసుకోవాలని కోరాడు. ఈ యంశాన్నే బ్రెంటు మహాసభ ఈలా బోధించింది. "క్రీస్తు సిలువపీఠం మీద తన్ను తాను తండ్రికి అర్పించుకొని మనలను శాశ్వతంగా రక్షించగోరాడు. ఐనా తన యాజకత్వం తన మరణంతో ముగియడం అతని కిష్టంలేదు. తనకు ప్రీతిని గలిగించే ఆధ్యాత్మిక పతియైన శ్రీసభ దృగ్లోచరమైన బలిని సమర్పించే మార్గం ఒకటుండాలని గూడ అతని కోరిక. దేహధారులైన నరులు అలాంటి దృగ్లోచరమైన బలిని మాత్రమే సమర్పించగలరు. ఈలాంటి బలిద్వారా ప్రభువు సిలువమీద ఒక్కసారి మాత్రమే సమర్పించిన బలిని మనం మళ్ళామళ్ళా పునశ్చరణం చేసికోవచ్చు. ఆ సిలువబలి జ్ఞాపకం లోకాంతం వరకు చెక్కుచెదరకుండా వుండిపోతుంది కూడ. కనుక అతడు తాను అత్పగింపబడిన రాత్రి తన శరీరాన్నీ రక్తాన్నీరొట్టె ద్రాక్షరాసాయ రూపాల్లో తండ్రికి అర్పించాడు. అదే రూపాల్లో వాటిని ప్రేషితులకు భోజనంగా దయచేసాడు. ఆ ప్రేషితులనూ వాళ్ళ అనుయాయులుగా వచ్చే గురువులనూ ఈ కార్యాన్ని నా జ్ఞాపకార్థంగా మీ మధ్యలో కొనసాగించండి అని ఆదేశించాడు." ఈ వాక్యాల్లో క్రీస్తు కడపటి విందు అవసరమమిటో స్పష్టంగా వివరింపబడింది. దేహధారులమైన మనం మన స్వభావానికి తగినట్లుగా ఆనాటి సిలువబలిని ఈనాడు భౌతిక రూపంలో పునశ్చరణం చేసికోగలిగి వండాలి. అందుకు అనువుగా వుండడం కోసమే క్రీస్తు కడపటి విందును నెలకొల్పాడు.