పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాణాలు కూడ కోల్పోవలసి వస్తుంది. ఈలా ప్రాణాలు కోల్పోయినవాళ్లే వేదసాక్షులు. ఈ సంస్కారం వలన లభించిన బలంతోనే ఈ వేదసాక్షులు మరణం వరకు పోరాడగల్లారు. తోమాసు ఆక్వినాసు భక్తుని భావాల ప్రకారం, భద్రమైన అభ్యంగనాన్ని వస్తుతః గాని ఆశాపూర్వకంగా గాని స్వీకరించందే ఎవరూ వేదసాక్షిగా మరణించలేరు. నా నామం కొరకు సొంత బంధువులే మిమ్మ ద్వేషించి వధిస్తారని ప్రభువు ముందుగానే చెప్పాడు - మార్కు 13, 12–13. నేడు మనం ఈ సంస్కారాన్నియోగ్యంగా స్వీకరించి అవసరమైనపుడు ప్రభువు సేవలో ప్రాణాలు త్యజించడానికి గూడ వెనుదీయకుండా వుండేంతటి బలాన్ని పొందాలి.

భద్రమైన అభ్యంగనం జ్ఞానస్నానాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఆ సంస్కారంలో ప్రారంభమైన వ్యక్తిగత పావిత్ర్యం ఈ సంస్కారంలోని సాంఘిక పావిత్ర్యం ద్వారా - అనగా లోకం యెదుట క్రీస్తుకి సాక్ష్యం పల్కడం ద్వారా – పరిపూర్ణమౌతుంది. జ్ఞానస్నానంవల్ల బాలక్రైస్తవులమైతే, దీనివల్ల వయసు వచ్చిన క్రైస్తవుల మౌతాం. బాలలు తమ శ్రేయస్సుని తాము కాంక్షిస్తారు. పెద్దవాళ్ళు ఇతరుల శ్రేయస్సునిగూడ కాంక్షిస్తారు. కనుక భద్రమైన అభ్యంగనం ద్వారా మనం ఇతరుల శ్రేయస్సుని కోరేవాళ్ళంగాను, ఇతరులకు క్రీస్తుని చాటిచెప్పేవాళ్ళంగాను తయారుకావాలి.

జ్ఞానస్నానంవలె ఈ సంస్కారం కూడ మనమీద అక్షయమైన ముద్రను వేస్తుంది. జీవితాంతమూ ఆ ముద్ర మన హృదయంమీద వుండిపోతుంది. కనుక జ్ఞానస్నానం వలె దీన్నిగూడ ఒక్కసారి మాత్రమే స్వీకరించాలి. జ్ఞానస్నానం ద్వారా మనం ప్రధానంగా యాజక. ప్రజలమౌతాం. భద్రమైన అభ్యంగనం ద్వారా ప్రవచనాత్మక ప్రజలమౌతాం. అనగా క్రీస్తుకి సాక్ష్యంపలికే వాళ్ళమౌతాం.

ఈ సంస్కారం ద్వారా మనం క్రైస్తవ సమాజంలో పరిపూర్ణ సభ్యులమౌతాం. ఆ సమాజానికి అధిపతీ, నాయకుడూ పీఠాధిపతి. కనుక దీన్ని మామూలుగా పీఠాధిపతే ఈయాలి. ఐనా అవసరమైనపుడు అతని అనుమతితో మామూలు గురువులు కూడ దీన్ని ఇస్తుంటారు.

శ్రీసభను గూర్చిన వాటికన్ చట్టం ఈలా బోధిస్తుంది. "భద్రమైన అభ్యంగం ద్వారా విశ్వాసులు శ్రీసభతో మరింత పరిపూర్ణంగా ఐక్యమౌతారు. ఆత్మ వాళ్ళకు ప్రత్యేకమైన బలాన్ని గూడ దయచేస్తుంది. కనుక వాళ్ళ క్రీస్తుకి సాక్షులై తమ మాటలద్వారాను చేతలద్వారాను క్రైస్తవ విశ్వాసాన్ని మరింత అధికంగా వ్యాప్తిచేయాలి. మరింత అదనంగా సమర్ధించాలికూడ" -11.