పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7. భద్రమైన అభ్యంగనం మనలను క్రీస్తుకి సాక్షులనుగా చేస్తుంది

జ్ఞానస్నానంలోనే మనం ఆత్మను పొందుతాం. కాని ఈ యాత్మ మన వ్యక్తిగత పావిత్ర్యంకొరకు ఉద్దేశింపబడింది. మళ్ళా భద్రమైన అభ్యంగనంలో కూడ ఈయాత్మను పొందుతాం. ఈ సంస్కారం ద్వారానే ఆత్మ ఈ లోకంలో మనం క్రీస్తుకి సాక్షులంగా మెలిగేలా చేస్తుంది. శిష్యులకు పెంతెకోస్తు ఏలాంటిదో మనకు భద్రమైన అభ్యంగనం అలాంటిద.అది మన వ్యక్తిగతమైన పెంతెకోస్త.దీనిద్వారా మనం మాటలతోను చేతలతోను క్రీస్తుని ఎల్లరికీ చాటి చెప్పేవాళ్ళమౌతాం. ఈ కడపటి అధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దాం.

1. ఆత్మ వాగ్హానం

ప్రభువు తన అనుచరులందరూ తన ద్వారా జీవాన్ని పొందుతారని నుడివాడు - యోహా 14,6. ఈ జీవం మనకు జ్ఞానస్నానం ద్వారాను ఆత్మద్వారాను లభిస్తుందని చెప్పాడు – 3,5. కనుక ఆత్మవలన మనకు జీవమూ వ్యక్తిగతమైన పావిత్ర్యమూ సిద్ధిస్తాయి. ఇది పూర్వవేదంలో యెహెజ్కేలు పేర్కొన్న ఆత్మ-36, 26-27.

కాని ప్రభువు మరొక అవసరాన్ని పురస్కరించుకొని గూడ శిష్యులకు ఆత్మను దయచేస్తానని వాగ్దానం చేసాడు. ఇదే ప్రేషితోద్యమం. శిష్యులు ప్రభువుని ఎల్లరికీ బోధించాలి. ఎల్లరియెదుట అతనికి సాక్షులుగా వుండాలి. దీనికిగూడ ఆత్మ అవసరం. వేదహింసల కాలంలో పవిత్రాత్మే శిష్యుల్లో వుండి మాటలాడుతుంది. శిష్యులద్వారా క్రీస్తుకి సాక్ష్యం పలుకుతుంది - మత్త 10, 17-20. ఇదే పూర్వవేదంలో ప్రవక్తలూ న్యాయాధిపతులూ పొందిన ఆత్మ ఈవరం ద్వారా మనం క్రీస్తుకి సాక్షులమై అతన్ని ఎల్లరికీ ప్రకటిస్తాం - అచ 1,8.

2. పై వాగ్దానం నెరవేరి శిష్యులు సాక్షులు కావడం

శిష్యులను క్రీస్తుకి సాక్షులనుగా జేసే ఆత్మ పెంతెకోస్తునాడు అపోస్తలులమీదికి దిగివచ్చింది. ఆ యాత్మ నాలుకల రూపంలో దిగివచ్చి వాళ్ళకు క్రీస్తుని బోధించే శక్తిని ప్రసాదించింది - అచ 2, 1–4 ఈ యాత్మ శక్తితో అపోస్తలులు వెంటనే క్రీస్తుని గూర్చి బోధించడం మొదలుపెట్టారు. మొదటి రోజుననే 3000 మందికి జ్ఞానస్నానమిచ్చారు - 2,42. క్రీస్తు పేరుమీదిగా అనేక అద్భుతాలను చేసారు. ఈలా వాళ్ళ అతనికి సాక్షులయ్యారు