పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు శిష్యులతో "ఆత్మ మీ మీదికి దిగివచ్చినపుడు మీరు శక్తిని పొందుతారు" అన్నాడు - అకా 1,8. ఈనాడు మనం కూడ ఈ సంస్కారం ద్వారా ఈ శక్తిని పొందుతాం. ఇదే ఆత్మవరం. ఈ వరంతో, ఈ శక్తితో, లోకంలో క్రీస్తుకి సాక్షులంగా మెలుగుతాం.

చాలమంది క్రైస్తవులు తాము క్రీస్తుకి సాక్షులమన్న సంగతిని గ్రహించనే గ్రహించరు. క్రీస్తుకి సాక్షులంగా మెలగడమంటే యేమిటి? ఆ ప్రభువుపట్ల భక్తి విశ్వాసాలను వ్యాప్తిచేయడం. అతన్ని లోకానికి ప్రకటించడం. కాని యెందరు విశ్వాసులు ఈ కార్యంలో పాల్గొంటారు? మన ప్రజలు తిరుసభ నుండి ఏవైనా సదుపాయాలు లభిస్తే వాటిని పొందటానికి లగెత్తుకొని వస్తారు. కాని ఆ సభకు ఏదైనా సేవలు చేయవలసి వచ్చినపుడూ, క్రీస్తుని బోధింపవలసి వచ్చినపుడూ, ఒక్కడూ ముందుకి రాడు. ఇది పద్ధతేనా?

2.జ్ఞానస్నానం తర్వాత భద్రమైన అభ్యంగనాన్ని పొందుతాం. జ్ఞానస్నానంలో ప్రారంభమైన పవిత్రకార్యం ఈ రెండవ సంస్కారం ద్వారా పరిపూర్ణమౌతుంది. పీఠాధిపతి ప్రార్ధనచేయగా పవిత్రాత్మ భక్తులమీదికి దిగివస్తుంది. ఈ యాత్మ మనకు తెలివి వివేకం విజ్ఞానం దైవభీతి దైవభక్తి దృఢత్వం సదుపదేశం అనే సప్తవరాలను ప్రసాదిస్తుంది. ఈ యేడు వరాలు ఏడు ఆత్మశక్తులను సూచిస్తాయి. ఈ యేడింటి ద్వారా గూడ మనం క్రీస్తుకి సాక్షుల మౌతాం.

౩.భద్రమైన అభ్యంగంలో పీఠాధిపతి అభ్యర్థి నొసటిమీద పరిమళ లేపనంతో సిలువగుర్తు వేస్తారు. ఈ లేపనాన్ని పీఠాధిపతి ప్రత్యేకంగా మంత్రిస్తారు. కనుక దానిలో ఆత్మ సాన్నిధ్యం వుంటుంది. కనుకనే సిరిల్ భక్తుడు ఈ లేపనాన్ని దివ్యసత్రసాదంతో పోల్చాడు. "రొట్టెమీదికి క్రీస్తుని ఆహ్వానింపగా అది ప్రభువు దివ్యశరీరమౌతుంది. ఆలాగే ఈ పరిమళ ద్రవ్యంమీదికి ఆత్మను ఆహ్వానింపగా అది ఆత్మ సాన్నిధ్యంతో నిండిపోతుంది" . 4.స్యూడో డయనీష్యన్ అనే భక్తుడు ఈలా చెప్పాడు. "భద్రమైన అభ్యంగనంలో వాడేపరిమలతేలాన్ని సువాసన గల మూలికలనుండి తయారుచేస్తారు. ఈ తైలం క్రీస్తు పరిమళాన్ని సూచిస్తుంది. ఈ దివ్యపరిమళం మన బుద్ధి శక్తిమీద, చిత్తశక్తిమీద సోకి వాటిని ఆనందపరుస్తుంది. మన కర్మేంద్రియాలు సువాసనను గ్రహించినట్లే మానసికేంద్రియాలైన బుద్ధిచిత్తశక్తులు కూడ క్రీస్తు దైవత్వమనే దివ్య పరిమళాన్ని గ్రహిస్తాయి."