పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాని 18వ శతాబ్దంలో బెనడిక్టు పోపుగారు అభ్యర్ధినొసటిమీద క్రిస్మాతైలంతో సిలువగుర్తు వేసేప్పడే అతని తలమీద కుడిచేతిని చాచి వుంచాలనికూడ నియమం చేసారు. ఇప్పటికీ ఈ నియమం చెల్లుతూంది. నేడు ఈ సంస్కారంలోని ప్రధానాంశం హస్తనిక్షేపణమేనని కొందరు వేదశాస్తులూ, కాదు అభ్యంగనమేనని మరికొందరూ వాదిస్తున్నారు. అధిక సంఖ్యాకులు మాత్రం ఈ రెండు కార్యాలూ ముఖ్యాంశాలేనని చెప్తున్నారు. క్రీస్తు సంస్కారాలను నెలకొల్పాడేగాని వాటినేలా నిర్వహించాలో స్వయంగా నిర్ణయించలేదు. ఆ నిర్వహణ విధానాన్ని శ్రీసభకే వదలివేసాడు. శ్రీసభ తొలిరోజుల్లో చేతులు చాచడానికి ప్రాముఖ్య మిచ్చినమాట నిజమే. కాని తర్వాత అభ్యంగనానికి ప్రాముఖ్యమిస్తే ఈయవచ్చు. సంస్కార నిర్వహణ విధానాన్ని ఎప్పడుకూడ తిరుసభే నిర్ణయిస్తుంది.

4. ఇప్పడు ఈ సంస్కారాన్ని జరిపే పద్ధతి యిది. పీఠాధిపతి అభ్యర్థి తలమీద చేతులుచాచి ప్రార్ధిస్తారు. అతడు బుద్ధి, జ్ఞానం, దైవభయం మొదలైన ఏడు ఆత్మవరాలను పొందాలని జపిస్తారు. కాని ఈ చేతులు చాచడం కేవలం ప్రారంభసాంగ్యం.

తర్వాత పీఠాధిపతి తనబొటన వ్రేలిని క్రిస్మాతైలంలో మంచి అభ్యర్థి నొసటిమీద సిలువగుర్తు వేస్తూ "నీవు పవిత్రాత్మవరముద్రను స్వీకరించు" అని చెప్తారు. ఇదే అభ్యంగనం. ఈ సిలువగుర్తు వేసేప్పడే బిషప్పగారు అభ్యర్థి తలమీద తన చేతినిగూడ చాస్తారు. ఈ రెండు కార్యాలే ఈ సంస్కారంలోని ముఖ్యాంశాలు.

కడన పీఠాధిపతి అభ్యర్ధి చెంపను మెల్లగా కొట్టి "నీకు సమాధానం కలుగుగాక" అని చెప్తారు. ఈ మెల్లగా కొట్టడమనేది మొదట ముద్దు రూపంలో వుండేది. ఆ ప్రక్రియ ఇప్పడు కొట్టడంగా మారింది. దీని భావమేమిటో స్పష్టంగా తెలియదు.

క్రిస్మా తైలాన్ని ఓలివు నూనెతోను బాల్సం అనే పరిమళ ద్రవ్యంతోను తయారుచేస్తారు. మామూలుగా ఈ సంస్కారాన్ని జరిపించేది పీఠాధిపతి. అవసరమైనపుడు, అతని అనుమతిపై, మామూలు గురువులు కూడ దీన్ని జరిపించవచ్చు. పైన పేర్కొన్న చారిత్రకాంశాలను జాగ్రత్తగా గుర్తిస్తేనే కాని ఈ సంస్కారం సరిగా అర్థం కాదు.

ప్రార్థనాభావాలు

1. పీఠాధిపతి అభ్యర్థి నొసటిమీద సిలువ గుర్తువేస్తూ "నీవు పవిత్రాత్మ వరముద్రను స్వీకరించు" అని చెప్తారని నుడివాం. ఈ ప్రార్ధనం ద్వారానే అభ్యర్థిమీదికి ఆత్మ వేంచేస్తుంది. ఈ సంస్కారంలో అభ్యంగనంతో గూడిన సిలువగుర్తు అనే ముద్రవేస్తాం. ఈ ముద్ర ద్వారా ఆత్మ వరాన్ని పొందుతాం. ఏమిటి ఈ వరం?