పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


3. హస్త నిక్షేపణం నుండి అభ్యంగనానికి మార్పు

అభ్యర్థిమీద చేతులు చాచడమే ఈ సంస్కారంలోని ప్రధానమైన కార్యమని తొలి శతాబ్దాల్లోనివాళ్ళు భావించారు. తర్వాత అభ్యంగనమే ప్రధాన కార్యమని ఎంచారు. ఈ మార్పు ఏలా వచ్చిందో పరిశీలిద్దాం.

1. అపోస్తలుల కాలంలోను, రెండు మూడు శతాబ్దాల్లోను అభ్యర్థిమీద చేతులు చాచడం మాత్రమే వాడుకలో వుండేది. ఈ హస్తనిక్షేపణమనేది బైబుల్లో ఆశీర్వాదానికీ అధికారప్రదానానికీ చిహ్నంగా వుంటుంది. ఆశీర్వాదచిహ్నంగా అభ్యర్ధులమీద చేతులు చాచేవాళ్ళు. క్రీస్తు చిన్నబిడ్డల మీద చేతులు చాచి వాళ్ళను దీవించినట్లుగా వింటున్నాం - మార్కు 10,16. రోగులమీద చేతులు చాచి వాళ్ళను స్వస్థపరచినట్లుగా చదువుతున్నాం - 6,5. ఈ యాశీర్వాద క్రియ ద్వారా భక్తులకు వర ప్రసాదమూ, దైవవరాలూ లభించేవి.

ఇక, అధికార చిహ్నంగా గూడ అభ్యర్ధులమీద చేతులు చాచేవాళ్ళ అపోస్తలులు ఏడురు భక్తులమీద చేతులు చాచి వాళ్ళను డీకన్లనుగా నియమించారు - అచ 6,6. పౌలు తిమోతిమీద చేతులు చాచి అతన్ని బిషప్పనిగా నియమించాడు - 2 తిమో 1,6.

బహుశ ఆ తొలిరోజుల్లో ఈ సంస్కారంలో వాడబడిన హస్తనిక్షేపణ క్రియ, దైవవరప్రసాదాన్నీ ఆ వరప్రసాదానికి కారణమైన పవిత్రాత్మని సూచించి వుంటుంది.

2. నాల్గవ శతాబ్దంలో అభ్యర్థిని ఓలివత్తైలంతో అభిషేకం చేయడమనేదికూడ ప్రచారంలోకి వచ్చింది. ఈ యాచారం మొదట గ్రీకు శ్రీసభలో వాడుకలోకి వచ్చింది. ఆ తిరుసభకు చెందిన దేశాల్లో దేహానికి బలాన్ని చేకూర్చడంకొరకు ఓలివు తైలాన్ని పులిమేవాళ్ళు తైలాభ్యంగం ఆరోగ్యానికీ, బలానికీ, సంతోషానికీ, వరప్రసాదానికీ గూడ చిహ్నం. పూర్వవేదంలో రాజులకూ ప్రధానయాజకులకూ అభ్యంగం చేసేవాళ్లు. క్రీస్తు అనగా అభ్యంగం పొందినవాడనే భావం - అచ 10,38. ఈ సంకేతం వల్లనే గ్రీకు శ్రీసభ ఓలివు తైలపు అభ్యంగాన్నిగూడ ఈ సంస్కారంలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియ దేవుని వరప్రసాదాన్ని సూచిస్తుందని భావించింది. గ్రీకు సంప్రదాయాన్ని చూచి ల్యాటిను శ్రీసభకూడ తర్వాత ఈ యాచారాన్ని స్వీకరించింది.

3. తొలిరోజుల్లో హస్తనిక్షేపణం ఒక్కటే వుండేది కనుక, దానివల్లనే ఆత్మను పొందుతామనే భావం ప్రచారంలో వుండేది. కాని నాల్గవ శతాబ్దం తర్వాత అభ్యంగం కూడ ప్రచారంలోకి వచ్చాక, ఈ క్రియవల్లనే ఆత్మను పొందుతామనే భావం బలపడింది. 13వ శతాబ్దంలో మహా వేదాంతియైన తోమాసు ఆక్వినాసుకూడ ఈ భావాన్నే సమర్ధించాడు. ఆ మీదట క్రమేణ హస్తనిక్షేపణానికి విలువతగ్గి అభ్యంగానికి విలువ హెచ్చింది.