పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆత్మ అందరికొరకూ ఉద్దేశింపబడింది. కనుక అపోస్తలు భక్తులమీద చేతులుచాచి వాళ్ళకు ఆత్మను ప్రసాదిస్తుండేవాళ్ళు ఈ సందర్భంలో అపోస్తలుల చర్యల గ్రంథం రెండు ప్రధాన సంఘటనలను ఉదాహరిస్తుంది. ఫిలిప్పసమరయలో బోధించి చాలమందికి జ్ఞానస్నాన మిచ్చాడు. తర్వాత పేతురు యోహాను వచ్చి ఈ భక్తులమీద చేతులు చాచగా వాళ్లు ఆత్మను పొందారు - 8,5, 14-17. ఈ సంఘటనలలో జ్ఞానస్నానమిచ్చింది ఫిలిప్ప, చేతులు చాచింది అపోస్తలులు, జ్ఞానస్నాన మీయడానికి చేతులు చాచడానికీ మధ్య కాలవ్యవధికూడ వుంది. ఆత్మ దిగి వచ్చింది ప్రధానంగా రెండవ కార్యం తర్వాత.

ఈలాంటిదే యెఫెసు సంఘటనంగూడ, అక్కడి భక్తులు పూర్వం స్నాపక యోహానునుండి జ్ఞానస్నానం పొందారు. అది చెల్లదని చెప్పి పౌలు వాళ్ళకు మళ్ళా క్రీస్తు పేరుమీదిగా జ్ఞానస్నానమిచ్చాడు. అటుతరువాత అతడు ఆ భక్తులమీద చేతులు చాచగా వాళ్ళంతా ఆత్మను పొందారు - 19, 1-7. ఈ సంఘటనల్లో మనం ముఖ్యంగా రెండంశాలను గుర్తించాలి. మొదటిది, భక్తులకు నీటితో జ్ఞానస్నానమీయడం మాత్రమేగాక వాళ్ళమీదికి చేతులుకూడ చాచేవాళ్ళ రెండవది, ఈలాచేతులు చాచేది ఎవరుపడితే వాళ్ళకాదు, అపోస్తలులు. ఆత్మవేంచేసివచ్చేది ఈ చేతులు చాచడం ద్వారానే. ఈ హస్తనిక్షేపణమే తర్వాత భద్రమైన అభ్యంగనంగా గుర్తింపబడింది. ఈ యంశం మీదట స్పష్టమౌతుంది.

2. పారంపర్యబోధ

పారంపర్యబోధను పరిశీలిస్తే మూడవ శతాబ్దం వరకు జ్ఞానస్నానమూ భద్రమైన అభ్యంగనమూ ఒకే సంస్కారంగా కనిపిస్తాయి. కాని జ్ఞానస్నానమిచ్చేది గురువైనా కడపట చేతులు చాచేకార్యం మాత్రం పీఠాధిపతే చేసేవాడు. ఆ ప్రక్రియవల్లనే ఆత్మ ప్రత్యేకవిధంగా వేంచేస్తుందని నాటి విశ్వాసులు భావించేవాళ్ళు.

4వ శతాబ్దంలో మార్చువచ్చింది. ఇవి రెండు సంస్కారాలనే భావం ప్రచారంలోకి వచ్చింది. గ్రీకు శ్రీసభలో ఈ రెండిటినీ కలిపి ఏక సంస్కారంగా గురువే జరిపేవాడు. కాని ఆ గురువు పీఠాధిపతి మంత్రించిన క్రిస్మాతైలాన్ని మాత్రమే వాడాలి. దీని ద్వారా ఈ సంస్కారానికి పీఠాధిపతితో సంబంధం వుందని సూచింపబడింది.

ల్యాటిన్ శ్రీసభలో గురువు జ్ఞానస్నాన మిచ్చేవాడు, పీఠాధిపతి భద్రమైన అభ్యంగనం ఇచ్చేవాడు. క్రమేణ వేదాంతులు ఈ రెండు సంస్కారాలకు వ్యత్యాసమేమిటా అని వితర్మించడం మొదలుపెట్టారు. 12వ శతాబ్దంలో భద్రమైన అభ్యంగనం కూడ ఏడు సంస్కారాల్లో ఒకటి అని నిర్ణయం చేసారు.