పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/148

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


- ఆది 2,7. అటుతరువాత ఈ యాత్మ ప్రవక్తలను ప్రేరేపించేదిగా చెప్పబడింది. అలాగే న్యాయాధిపతులు రాజులు మొదలైన అధికారులను నడిపించేదిగా వర్ణింపబడింది. ఈ యధికారులూ ప్రవక్తలూ దేవునికి సాక్షులుగా ఉండేవాళ్ళు కనుక ఆత్మ వాళ్ళకు నాయకత్వాన్ని దయచేసి వాళ్ళ దేవుని రక్షణ కార్యాలకు సాక్షులుగా వుండేలా చేసేది.

కడన బైబులు, మెస్సియా కాలంలో ఆత్మ సమృద్ధిగా అనుగ్రహింపబడుతుందని వాకొంటుంది. ఈ యాత్మప్రజలకు పావిత్ర్యాన్ని దయచేస్తుంది. నరుల్లోని రాతి గుండెను తీసివేసి దానిస్థానే మాంసపు గుండెను నెలకొల్పుతుంది - యెహె 36, 26-27. ఐతే మెస్సియా ఈ యాత్మను విశేషంగా పొందుతాడు. అతడు ఆత్మనుండి తెలివి, వివేకం, విజ్ఞానం, సదుపదేశం, దృఢత్వం, దైవభీతి, దైవభక్తి మొదలైన సప్తవరాలను స్వీకరిస్తాడు - యెష 11, 1-3, అతడు ఆత్మవలన అభిషేకం పొంది పేదలకు సువార్త బోధిస్తాడు 61, 1 లూకా 4,18. ఇంకా ఒక విశేషమేమిటంటే మెస్సియా కాలంలో ప్రజలందరు ఈ యాత్మను పొందుతారు. ప్రభువు ప్రజలందరి మీదా తన ఆత్మను కుమ్మరిస్తాడు - యోవేలు 2, 28-32. అచ 2, 1–18.

క్రీస్తు శిష్యులకు బోధించేపుడు ఈయాత్మ వాగ్దానాన్ని వాళ్ళకు చాలసార్లు జ్ఞప్తికి తెచ్చాడు. తాను వెత్తేనేగాని ఆత్మరాదనీ, తాను వెళ్ళి ఆ దివ్యశక్తిని పంపుతాననీ చెప్పాడు - యోహా 16, 7. ఉత్తాన మయ్యాక అతడు "నేను తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను మీ మీదికి పంపుతాను. ఆ శక్తిని పొందిందాకా మీరు యెరూషలేము పట్టణంలోనే వుండండి" అని శిష్యులను ఆదేశించాడు - లూకా 24, 49. ఇంకా అతడు "ఆత్మ మీ మీదికి వచ్చినపుడు మీకు అద్భుతమైన శక్తి లభిస్తుంది. ఆ శక్తితో మీరు నేల నాలుగు చెరగులదాక నాకు సాక్షులై వుంటారు" అని సెలవిచ్చాడు - అచ 1,8.

2) పై వాగ్దానం నెరవేరడం

నూత్న వేదంలో పవిత్రాత్మ శిష్యులమీదికి దిగివచ్చినపుడు ఆత్మను గూర్చిన పై వాగ్దానాలన్నీ నెరవేరాయి. ఆత్మ గాలిలాగ, అగ్నిలాగ, నాలుకల్లాగ శిష్యులమీదికి దిగివచ్చింది. - అచ 2, 1–4 ఉత్దాన క్రీస్తు తండ్రి కుడిప్రక్కన ఆసీనుడై అతనినుండి ఆత్మను స్వీకరించాడు. ఆలా తాను స్వీకరించిన ఆత్మను పెంతెకోస్తుదినాన శిష్యులమీద కుమ్మరించాడు - 2, 38. పూర్వం యోవేలు ప్రవక్త మెస్సీయా కాలంలో ఈ యాత్మ అందరిమీదికీ దిగివస్తుందని ప్రకటించాడుకదా! పేత్రు ఈ ప్రవచనం భావాన్ని చక్కగా గ్రహించాడు. కనుకనే అతడు తన మొదటి ప్రసంగంలో "ఈ యాత్మ మీకూ, మీ పిల్లలకూ, దూరస్టులకీగూడ" అని చెప్పాడు - 2, 39.