పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/143

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనం జ్ఞానస్నానం లేని బిడ్డలకుగూడ రక్షణం కలుగుతుందిలే అనుకొని శిశువులకు ఈ సంస్కారాన్ని ఇప్పించడంలో అశ్రద్ధ చేయకూడదు. ఇక, జ్ఞానస్నానం లేకుండా చనిపోయే అసంఖ్యాక శిశువుల కొరకు మనం ప్రార్ధనం మాత్రంచేయాలి. మన ఈ ప్రార్ధనలద్వారా, మంచి కోరికలద్వారా, వేదశాస్త్రులు పైన నుడివినట్లు, దేవుడు ఆ శిశువులను రక్షిస్తే రక్షించవచ్చు.

3. వేదసాక్షి మరణం

రక్షణానికి మామూలుగా జ్ఞానస్నానం అవసరం. కాని అది అన్ని పరిస్థితుల్లో అవసరం కాదు. ఉదాహరణకు వేదసాక్షిగా మరణించే భక్తునికి జ్ఞానస్నానం లేకపోయినా రక్షణం సిద్ధిస్తుంది. వేదసాక్షి మరణమంటే క్రైస్తవవిశ్వాసం కారణంగా శత్రువులు మనలను బాధించి చంపుతారు. మనం కూడ విశ్వాసంతోను ఓర్పుతోను ఆ మరణాన్ని అంగీకరిస్తాం. ఈలాంటి మరణం మనలను రక్షిస్తుంది.

ప్రభువు మనుష్యుల యెదుట నన్ను వొప్పుకొనేవాణ్ణి పరలోకంలోని తండ్రియెదుట నేనూ వొప్పకొంటాను అన్నాడు — మత్త 10,32. ఇక్కడ "మనుష్యుల యెదుట క్రీస్తుని వొప్పకోవడం” అంటే వేదహింసలకాలంలో క్రీస్తుని అంగీకరించడం అని భావం. ఇంకా అతడు నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకొంటాడు అన్నాడు - 10, 39. వేదసాక్షులు ఈలాంటివాళ్ళే.

కనుకనే తిరుసభ తొలినాటినుండి వేదసాక్షులను పునీతులనుగా భావించి గౌరవిస్తూంది. క్రీస్తుకొరకు ప్రాణాలర్పించిన పావన పసిబిడ్డలను గూడ పునీతులుగా భావించి కొనియాడుతూంది. పితపాదులు వేదసాక్షి మరణం జ్ఞానస్నానంలాంటిదన్నారు. అది మన పాపాలనూ అనిత్య శిక్షలను గూడ తొలగిస్తుందని బోధించారు. అగస్టీను భక్తుడు “మనం వేదసాక్షుల కొరకు ప్రార్ధిస్తే వాళ్ళను అవమానపరచినట్లే ఔతుంది. కనుక వాళ్ళనే తమ వేడుదలద్వారా మనలను రక్షించాలని అడుగుకోవాలి. జ్ఞానస్నానపుతొట్టిలో మునిగినపుడు పాపాలు పరిహారమైనట్లే వేదసాక్షి మరణంద్వారా గూడ పరిహారమౌతాయి" అని నుడివాడు.

జ్ఞానస్నానపు నీళ్లు మనమీద పడినపుడు క్రీస్తు మరణం మనమీద సోకుతుంది. దానివల్ల మనకు పాపపరిహారం లభిస్తుంది. అలాగే వేదసాక్షి మరణంలోగూడ క్రీస్తుమరణం భక్తుని మీద సోకుతుంది. కనుక అతనికి గూడ పాపపరిహారం సిద్ధిస్తుంది. ఇక్కడ ఈ భక్తుడు తన పాపాల కొరకు పశ్చాత్తాపపడ్డం మాత్రం అవసరం. కాని క్రీస్తు కొరకు • ప్రాణాలర్పించే వాడికి తన పాపాలకొరకు పశ్చాత్తాపపడేంత భక్తి వుండకుండా వుంటుందా?