పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక్కడ క్రీస్తు సీనాయి నిబంధనంలో మోషేలాగే బలి నర్పించాడు. ఇక పౌలు లూకాలు యిర్మియా పేర్కొన్న క్రొత్త నిబంధనాన్నీ యెషయా పేర్కొన్న బాధామయ సేవకుణ్ణి క్రీస్తుకి అన్వయించారు. ఈ క్రీస్తు ద్వారా తండ్రి మనతో "క్రొ నిబంధనం" చేసికొంటాడనీ, ఈ సేవకుడు మనకు పాపవిముక్తి కలిగిస్తాడనీ చెప్పారు. ఈ రచయితల భావాల ప్రకారం ఆ బాధామయ సేవకుళ్లాగ క్రీస్తు కూడ ప్రాణత్యాగం చేసికొన్నాడు.

అంత్యభోజన సమయంలో ప్రభువు రొట్టెను ఆశీర్వదించి ఇది నా శరీరం అన్నాడు. ద్రాక్షసారాయాన్ని ఆశీర్వదించి ఇది నా రక్తం అన్నాడు. ఈ వాక్యాలు ప్రవచనాత్మకమైన కార్యాలు. పూర్వం ప్రవక్తలు తమ బోధలను నటించి చూపించేవాళ్ళ వాళ్ళు నటించి చూపించినట్లే ఆ బోధలు తర్వాత నెరవేరేవి. ఉదాహరణకు యిర్మీయా తన అంగవస్త్రం చివికిపోయినట్లే యూదాకూడ చివికి చినిగిపోతుందని చెప్పాడు. అలాగే జరిగింది - యిర్మీ 13, 1–11. క్రీస్తుకూడ ఇక్కడ ఈ ప్రవక్తల సంప్రదాయాన్ని పాటించాడు. ఈ రొట్టె అతడు సిలువమిూద సమర్పించే తన దేహమై తీరుతుంది. ఈ ద్రాక్షసారాయం అతడు సిలువమీద చిందించే తన నెత్తురై తీరుతుంది.

ఇంకా హీబ్రూ సంప్రదాయం ప్రకారం శరీరమంటే వట్టి శరీరం మాత్రమే కాదు. సంపూర్ణ వ్యక్తి. అలాగే రక్తమంటే వట్టి రక్తం మాత్రమే కాదు. సంపూర్ణ వ్యక్తి కనుక క్రీస్తు ఇది నా శరీరం, ఇది నా రక్తం అన్నపుడు తన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సూచించాడు. అనగా తన శరీరంతో, రక్తంతో, ఆత్మతో తన్ను తాను మనకు ఆహారంగా సమర్పించుకొంటున్నానని అతని భావం. పైపెచ్చు యూదులు నెతురులో ప్రాణముంటుందని భావించారు అని చెప్పాం. కనుక క్రీస్తు నెత్తుటిలో అతని ప్రాణముంటుంది. అందుచేత ఈ భోజన పదార్థాల ద్వారా అతడు తన జీవశక్తినే మనకు ప్రసాదించాడని అర్థం చేసికోవాలి.

ఈ యంతిమ భోజనంలో ఇంకో అంశంగూడ గమనించాలి. ఈ భోజనాన్ని శిష్యులు మాత్రమే భుజించారు, క్రీస్తు భుజించలేదు — మత్త 26,29. లూకా 22,18. ఈ కడపటి భోజనం ప్రభువు సిలువ బలిని సూచిస్తుంది. ఈ యంశం మీదట స్పష్టమౌతుంది. ఆ సిలువబలిలోను, దానికి ప్రతిబింబమైన ఈ అంతిమ భోజనంలోను బలిపశువు క్రీస్తే కనుక శిష్యులు సిలువబలి నైవేద్యంగానే ఇక్కడ క్రీస్తుని భుజించారు - అనగా అతని శరీరాన్నీ రక్తాన్నీ సూచించే రొట్టెనూ ద్రాక్షసారాయాన్నీ పుచ్చుకొన్నారు. క్రీస్తు తన్నుతాను భుజించడం అసంభవం. కనుక కడపటి భోజనంలో అతడు స్వయంగా రొట్టెనూ ద్రాక్షసారాయాన్నీ పుచ్చుకోలేదు.