పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8) ప్రవక్తృత్వం, క్రీస్తు తండ్రినిగూర్చి బోధించిన ప్రవక్త జ్ఞానస్నానం ద్వారా మనంకూడ అతని ప్రవక్తృత్వాన్ని పొందుతాం. గురువు అధికార పూర్వకంగా దేవుణ్ణి గూర్చి బోధిస్తాడు. కాని గృహస్తులు అధికార పూర్వకంగా గాక తమ సదాదర్శం ద్వారానే బోధిస్తారు. తమ మంచి జీవితం ద్వారానే దేవునికి సాక్ష్యంగా వుంటారు. ఆ దేవుణ్ణి గూర్చిన బోధను స్వయంగా విని దాన్ని తమ అనుదిన జీవితంలో జీవిస్తారు. తమ బిడ్డలకు వేదసత్యాలను బోధిస్తారు.

జ్ఞానస్నానం ద్వారా నరులు త్రీత్వైక సర్వేశ్వరునికి అంకితులౌతారు. ఆ ప్రభునికి బిడ్డలై అతని జీవితాన్ని జీవించడం మొదలిడతారు. కనుక ఆ భగవంతునిలాగే క్రైస్తవులంతా గూడ పరిశుద్ధ జీవితం జీవించాలి. దేవుడు పంపగా వచ్చిన క్రీస్తుని అడుగుజాడల్లో నడవాలి.

కాని సన్యాస జీవితంగడిపే వాళ్ళకు ఈ పరిశుద్ధత్వపు బాధ్యత మరీ యొక్కువ. వాళ్ళ ప్రపంచాన్ని పరిత్యజించి దేవుని సేవకు అంకితులైనవాళ్ళు క్రీస్తుకి మరింత సన్నిహితులై అతన్ని అనుకరింపవలసినవాళ్ళు. దీనికిగాను వాళ్ళ మూడు ప్రతాలద్వారా ప్రత్యేక విధంగా దేవునికి సమర్పితులౌతారు. దేవుని కుమారుని పోలిన జీవితం జీవిస్తారు. కాని ఈ విశిష్ట సమర్పణం కూడ జ్ఞానస్నానంలో ఒక భాగమే. దీనిద్వారా వాళ్లు దేవునికి సంపూర్ణంగాను శాశ్వతంగాను అంకితులౌతారు. కనుక సన్యాస జీవితం జీవించేవాళ్లు కూడ జ్ఞానస్నాన జీవితాన్ని మరింత అర్థవంతంగా జీవిస్తారు, అంతే క్రైస్తవుల్లో ఎవరుకూడ ఎప్పడు కూడ, జ్ఞానస్నాన బాధ్యతలను మించిన పవిత్ర జీవితం జీవించలేరు.

5. క్రొత్తపట్టవనీ క్రొత్త సృష్టినీ దయచేస్తుంది

నరుడు నీటిద్వారాను ఆత్మద్వారాను క్రొత్త పుట్టువు పడితేనేతప్పదైవరాజ్యంలో ప్రవేశించలేడు - యోహా 3,5, జ్ఞానస్నానం వలన మనకు ఆదామునుండి వచ్చిన ప్రాతదైన పాపపు పట్టవుపోయి, ఆత్మనుండీ క్రీస్తునుండీ వచ్చిన పవిత్రమైన క్రొత్తపట్టువు సిద్ధిస్తుంది. దీన్నే యోహాను "పైనుండి పుట్టడం" అనికూడ పేర్కొన్నాడు - 3,3.

దీన్నే "పౌలు నూత్న సృష్టి" అని వాకొన్నాడు. "ఎవడైనా క్రీస్తునందుంటే అతడు నూత్నస్తృష్టి ఔతాడు. ప్రాతవి గతించి క్రొత్తవి వచ్చాయి" - 2కొరి 5, 17. ప్రాతసృష్టి వుంది. ప్రాతమానవుడైన ఆదాముకూడ వున్నాడు. కాని జ్ఞానస్నానం మళ్ళా నూత్న సృష్టిని చేస్తుంది - గల 6,15. ఇది తొలిసృష్టి కంటెగూడ గొప్పది. ఈ సృష్టిలో పాత మానవుడైన ఆదామునకు బదులుగా నూత్నమానవుడు ఉద్భవిస్తాడు. జ్ఞానస్నానం పొందిన నరుడు దేవుని బిడ్డడౌతాడు కదా!