పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అభిషిక్తుడయ్యాడు. ఇక్కడ దైవవార్తే తాను చేకొన్న మానవ దేహానికీ అభిషేకం చేసింది - హెబ్రే 2, 17-18. జ్ఞానస్నానం పొందిన సమయంలో పవిత్రాత్మ ఆయన్ని ప్రవక్తగా అభిషేకించింది - మత్త 3, 16.

మనం జ్ఞానస్నానం పొందినపుడు రాజు, యాజకుడు, ప్రవక్త ఐన క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందుతాం. కనుక క్రీస్తుకి వర్తించే పై మూడు గుణాలూ మనకుగూడ సంక్రమిస్తాయి. వీటిల్లో యాజకత్వం చాల ముఖ్యమైంది. ఇక్కడ ఈ మూడు లక్షణాలను క్రమంగా పరిశీలిద్దాం.

1) యాజకత్వం. క్రీసు యాజకత్వాన్ని పొంది మనమందరమూ యాజకులమౌతాం. దీని ద్వారా దేవుణ్ణి పూజించి ఆరాధించే శక్తిని పొందుతాం. క్రీస్తు జీవితం ప్రధానంగా ఆరాధనాత్మకమైంది. ఆయన నిరంతరమూ తండ్రిని ఆరాధిస్తూ జీవించేవాడు. కడన సిలువమీద ఆ తండ్రి చేతుల్లోనికే ఆత్మార్పణం చేసికొన్నాడు. జ్ఞానస్నానంద్వారా మనం కూడ ఆరాధకుడైన క్రీస్తునందు ఆరాధకుల మౌతాం. మన ఆరాధనను ఇప్పడు ప్రధానంగా పూజబలితో నిర్వర్తిస్తాం. జ్ఞానస్నానంద్వారా క్రీస్తులోనికి ఐక్యమైనవాళ్ళంతా ఒక్క ఆరాధనా సమాజమౌతారు. క్రీస్తుతో ఐక్యమై ఆయన ద్వారా తండ్రిని కొలుస్తారు.

నూత్నవేద0లో జ్ఞానస్నానం పొందిన వాళ్ళంతా యాజకులౌతారు. కాని మనకు రెండు యాజకత్వాలున్నాయి. మొదటిది జ్ఞానస్నాన యాజకత్వం. ఇది అందరికీ సంక్రమిస్తుంది. రెండవది పరిచర్యకొరకు కొందరు ప్రత్యేకంగా పొందే యాజకత్వం. దీన్నే గురుపట్టం అంటాం.గురువులు శ్రీసభకు శిరస్పయిన క్రీస్తుకి ప్రతినిధులుగావుండి క్రైస్తవ సమాజానికి సేవలు చేస్తూంటారు. ప్రస్తుతం మనకు ప్రస్తావించేది మొదటి రకం యాజకత్వాన్ని మాత్రమే.

ఈ యాజకత్వం మనకు జ్ఞానస్నానపు ముద్రనుండే సంక్రమిస్తుంది. పూర్వవేదంలో యిస్రాయేలు ప్రజలంతా యాజకులు. ఎన్నికద్వారాను సీనాయి నిబంధనం ద్వారాను వాళ్ళకు ఆ భాగ్యం లభిస్తుంది. ప్రభువు వాళ్ళతో “మీరు నాకు యాజకులూ, పవిత్ర ప్రజా ఔతార"ని చెప్పాడు - నిర్ణ 19,6. వాళ్ళు యావే యాజకులూ, ప్రభువు పరిచారకులూ అని పిలువబడతారు అని చెప్పాడు - యెష 61, 6. నూత్న వేదంలో మనం జ్ఞానస్నానంద్వారానే ఈ యాజకత్వం పొందుతాం. కనుకనే పేత్రు మొదటిజాబు జ్ఞానస్నానం పొందినవాళ్ళ నుద్దేశించి "మీరు ఎన్నుకోబడిన ప్రజలు, శ్రేష్ఠయాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవునిచే కొనబడిన ప్రజలు" అని చెప్పంది. అనగా పూర్వవేదంలో ఎన్నికా నిబంధనమూ ఏలాంటివో నూత్న వేదంలో జ్ఞానస్నానం అలాంటిది. ఆ ప్రజలు దేవుణ్ణి కొల్చినట్లే మనమూ తండ్రిని పూజిస్తాం.