పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జ్ఞానస్నానం పొందేవ్యక్తిని గురువు క్రీస్తుకి గుర్తుగా వుండే క్రిస్మాతైలంతో అభిషేకిస్తారు. ఆయన తలమీద ఆ తైలంతో సిలువగుర్తు వేస్తారు. ఆ మీదట ఆ వ్యక్తి క్రీస్తుతో ఐక్యమై ఆయన సిలువను భరిస్తాడు.

జ్ఞానస్నానంవల్ల మన జీవితం క్రీస్తుజీవితాన్ని పోలిందవుతుంది. అనగా క్రీస్తు మరణోత్థానాలు మనలోకూడ ప్రత్యక్షమౌతాయి. పౌలు దృష్టిలో క్రైస్తవ జీవితమంటే జ్ఞానస్నాన జీవితాన్ని సంపూర్ణంగా జీవించడమే. ఈ సంస్కారం ద్వారా మనం పాత జీవితాన్ని విడనాడి నూత్నజీవితాన్ని అనగా క్రీస్తుజీవితాన్ని జీవించడం మొదలిడతాం. ఈ నూత్నజీవితానికి తగ్గట్టుగా మన చేతలు గూడ నూత్నంగానే వండాలి. పౌలు మాటల్లో చెప్పాలంటే మనం క్రీస్తుని ధరిస్తాం - గల4,27. ఫలితంగా నూత్న జీవితం జీవిస్తాం - రోమా 6,4, మన యీ దేహంలో క్రీస్తు మరణాన్ని భరించే మనం ఆయన జీవాన్ని కూడ భరిస్తాం - 2 కొరి 4,10.

జ్ఞానస్నానంవల్ల మన జీవితం క్రీస్తు జీవితానికి పోలికగా తయారౌతుందని చెప్పాం. ఈ పోలిక మన జీవితాంతమూ వుంటుంది. మన మరణం ఈ పోలికలో చివరిమెట్టు. జ్ఞానస్నాన బలంవల్ల మన మరణం ఆ ప్రభువు మరణాన్ని పోలినదౌతుంది. ఆయన దివ్యమరణం మన మరణంమీదసోకి దాన్ని ఫలభరితం చేస్తుంది. కనుక మరణం తర్వాత మనకు ఉత్దాన భాగ్యం సిద్ధిస్తుంది. పాప ఫలితం మరణం. కాని ఆ మరణమే ప్రభువైన క్రీస్తు ద్వారా మనకు నిత్యజీవితాన్ని దయ చేస్తుంది - రోమా 6, 23.

జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో పాలుపొంది ఆయనతో ఐక్యమౌతామనే సత్యాన్ని తిరుసభలో రెండుజీవిత విధనాలు విశేషంగా రుజువుచేస్తాయి. అవి వేదసాక్షిమరణం, సన్యాస జీవితం.

వేదసాక్షిగా మరణించడమంటే ప్రేమభావంతో క్రీస్తు మరణాన్ని ఆహ్వానించడమే. కనుక ఆ మరణం మనలను సిలువమరణం చెందిన క్రీస్తుతో ఐక్యంచేస్తుంది. అసలు వేదసాక్షిగా మరణించే వ్యక్తిలో క్రీస్తే మరణిస్తాడు. కనుకనే పెర్పెత్తువా అనే భక్తురాలు వేదసాక్షిగా మరణిస్తూ "ఇంతకు ముందు నేను హింసలనుభవించాను. కాని ఇప్పడు క్రీస్తే నాలో హింసలనుభవిస్తాడు” అని వాకొంది.

వేదహింసలు అడుగంటాక శ్రీసభలో వేదసాక్షి మరణం అరుదైపోయింది. దానిస్థానే సన్యాస జీవితం వచ్చింది. వేదసాక్షి ఒక్కక్షణంలో ప్రాణత్యాగం చేస్తే సన్యాస జీవితం గడిపేవాళ్ళు జీవితమంతా ప్రాణత్యాగం చేయవలసివుంటుంది. కనుక ఈ జీవితం "కూడ క్రీస్తు మరణంలో పాలుపొందడమే ఔతుంది.