పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యూదులు ఫరో దాస్యాన్నుండి తప్పించుకొన్నారు. క్రీస్తు సిలువ మరణం వలన మనం పిశాచ దాస్యంనుండి తప్పించుకొన్నాం. వాళ్ళ గొర్రెపిల్లను చంపి దాని నెత్తుటిని ద్వారబంధాలకు పూసి వినాశమూర్తియైన దేవదూతనుండి తప్పించుకొన్నారు. క్రీస్తు చిందిన నెత్తురు మనలను మన పాపకార్యాలనుండి రక్షించింది. వాళ్ళ నాయకుడు మోషే. మన నాయకుడు క్రీస్తు. మోషే సముద్రాన్ని పాయలుగా చీల్చి ఆ ప్రజలను ఆవలి వొడ్డుకి నడిపించాడు. మన రక్షకుడు పాతాళానికి దిగి దాని ద్వారాలను తెరిచాడు. తన్ను విశ్వసించే వాళ్ళందరూ ఆ పాతాళం నుండి వెలుపలికి రావడానికి మార్గం నిర్మించాడు".

ఈ వాక్యంలో చాలా భావాలున్నాయి. ఐగుపులో గొర్రెపిల్ల నెత్తురు పూర్వవేద ప్రజలను కాపాడింది. ఇక్కడ క్రీస్తు చిందించిన నెత్తురు నూత్నవేద ప్రజలను కాపాడుతుంది. ఈ నూతప్రజను విమోచించింది వెండి బంగారాలలాంటి క్షుద్రవస్తువులు కాదు. నిర్దోషమూ నిష్కలంకమూ అమూల్యమునైన గొర్రెపిల్ల నెత్తురు -1 పేత్రు 1,18-19.

ఐగుపులోని ప్రజలు దాస్యగృహంనుండి బయలుదేరి సముద్రాన్ని దాటారు. పాలు తేనెలు ప్రవహించే వాగ్డత్త భూమిని చేరారు. క్రీస్తు ఈ లోకాన్ని దాటి తండ్రి వద్దకు వెళ్ళాడు. ఈ భావాన్ని యోహాను సువిశేషం "యేసు తాను ఈ లోకంనుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినదని యెరిగినవాడై" అన్న వాక్యంలో సూచించింది - 13,1.

అక్కడ మోషే నాయకుడు. అతడు యిప్రాయేలీయులకు విమోచకుడు- అచ 7.85. కాని అతడురాబోయే మరో గొప్ప విమోచకుడు క్రీస్తుకి సూచనంగా వుంటాడు.

మోషే సముద్రాన్ని పాయలుగా చీల్చి దారి కల్పించాడు. క్రీస్తు పాతాళద్వారాలను విప్పి అక్కడ బందీలైయున్న నీతిమంతులు వెలుపలికి రావడానికి మార్గం నిర్మించాడు. మృతక్రీస్తుని సమాధి చేసారుకదా! అక్కడి నుండి అతడు పాతాళానికి దిగి పిశాచాన్నీ మృత్యువనీ జయించాడు. పూర్వ వేదపు నీతిమంతులను పాతాళంనుండి విడిపించాడు. మూడవనాడు ఉత్థానుడై తనతోపాటు ఆ నీతిమంతులను గూడ స్వర్గానికి తోడ్కొని పోయాడు -1 పేత్రు 3,19. ఇది క్రీస్తు నిర్గమనం.

3) ఇక, యిప్రాయేలీయుల నిర్గమనం, క్రీస్తునిర్గమనం జ్ఞానస్నానంలో మనకు సంక్రమిస్తాయి. సముద్రంగుండా దాటిపోయి యిస్రాయేలీయులు ఫరో దాస్యంనుండి తప్పించుకొన్నారు. జ్ఞానస్నాన జలంగుండా దాటిపోయి ఈనాడు మనం పిశాచ దాస్యంనుండి తప్పించుకొంటాం. ఈ సంస్కారం ద్వారా మనం క్రీస్తుతోనిబంధనం చేసికొంటాం. అతడు మనకు దేవుడౌతాడు, మనం అతన్ని కొలిచే భక్తుల మౌతాం. అతని నాయకత్వాన మనం ఈ లోకాన్ని దాటతాం. ఇక్కడినుండి మోక్షానికి యాత్ర చేస్తాం. ఈ యిహలోకం మనకు కేవలం యాత్రాస్థలం - హెబ్రే 13,14.