పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. ఈ సంస్కారాన్ని ఎవరెవరు పొందవచ్చు? ప్రభువు మీరు సమస్త జాతిజనులకు బోధించి జ్ఞానస్నాన మీయండని ఆదేశించాడు-మత్త 28 19, ప్రతి నరుడు రక్షణం పొందాలనే భగవంతుని కోరిక-1తిమో 2,4. క్రీస్తు నికొదేమతో చెప్పినట్లు రక్షణం పొందాలంటే మామూలుగా ఈ సంస్కారం అవసరం - యోహా 3,5. కనుక ప్రతిఒక్కరూ వొకసారి జ్ఞానస్నానం పొందవచ్చు. పొందాలి. అలా పొందనివాళ్లను వాళ్ళవాళ్ళ హృదయాల్లోని భక్తినిబట్టి భగవంతుడు ప్రత్యేక పద్ధతిలో రక్షిస్తుంటాడు. ఈ విషయాన్ని మీదట పరిశీలిద్దాం.

ప్రార్థనాభావాలు

1. మంత్రించిన నీటితో గురువు జ్ఞానస్నాన మిస్తారు. ఈ జలంతో పవిత్రాత్మ శక్తి నెలకొని వుండడంవల్ల అది మన పాపమాలిన్యాన్ని తొలగిస్తుంది. ఈ సందర్భంలో ఇతియోపియను ఆరాధనవిధిలోని ఓ ప్రార్ధనం ఇది. "ఓ ప్రభూ! నీవు యోషువా కాలంలో యోర్గాను నదీప్రవాహం వెనుకకు మరలేలాచేసావు. ఏలీయా సమర్పించిన జలసంబంధమైన బలిని అంగీకరించి ఆకాశంనుండి అగ్నిని పంపావు. ఎలీషా ప్రవక్త ద్వారా నామాను యోర్గాను నదీజలంలో శుద్ధిని పొందేలా చేసావు. నీవు అన్ని పనులూ చేయగలవు, నీకు అసాధ్యం ఏమీ లేదు. ఆ యోర్గాను నదికున్న శక్తినే ఇప్పడు ఈ జలాలకు గూడ ప్రసాదించు. నీ పవిత్రాత్మను ఈ నీటి మీదికి పంపు."

2. జ్ఞానస్నానం పొందిన పిదప గురువు అభ్యర్థి తలకు క్రిస్మాతైలంతో అభిషేకం చేస్తారు. క్రిస్మా అనే గ్రీకు మాటకు తైలం, అభిషేకం అని అర్ధాలు. ఈ సందర్భంలో గురువు "సర్వేశ్వరుడు మిమ్మక్రిస్మాతైలంతో అభిషేకం చేస్తున్నాడు. దీని ఫలితంగా మీరు దేవుని ప్రజలలో చేరుదురుగాక, గురువు రాజు ప్రవక్తయైన క్రీస్తుతో మీరు నిత్యం ఐక్యమై యుందురుగాక" అనే ప్రార్థనను చెప్తారు. క్రిస్మాని లేక అభిషేకాన్ని పొందిన వ్యక్తి క్రీస్తు క్రీస్తు తండ్రినుండి ఆత్మనుండి అభిషేకం పొంది రక్షకపదవిని స్వీకరించాడు. ఆ క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది అతని అడుగుజాడల్లో నడిచేవాళ్ళం గనుక మనం క్రైస్తవులమయ్యాం. జ్ఞానస్నానంలో మనం పొందే అభిషేకo ద్వారా మనమీద అక్షయమైన క్రీస్తు ముద్ర పడుతుంది. కనుక మనం ఆ ప్రభువులోనికి ఐక్యమైనవాళ్ళం, అతనికి అంకితమైనవాళ్ళం, అతని శిష్యులం అన్న భావాన్ని ఎప్పడూ విస్మరించకూడదు.