పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. జ్ఞానస్నాన ఫలాలను గూర్చి మాట్లాడుతూ యెరూసలేం సిరిల్ భక్తుడు ఈలా నుడివాడు. "జ్ఞానస్నానం బందీలను చెరనుండి విడిపిస్తుంది. పాపవిమోచనం కలిగిస్తుంది. దోషాన్నితొలగిస్తుంది. ఆత్మకు నూత్నజన్మనిస్తుంది. తేజోమయమైన వస్త్రాన్ని దయచేస్తుంది. పవిత్రమూ అవినాశమూ ఐన ముద్రను ప్రసాదిస్తుంది. ఒక వాహనమై మనలను స్వర్గానికి చేరవేస్తుంది. పరలోకానందాన్ని దయచేస్తుంది మనలను దత్తపుత్రులనుచేసి మోక్షానికి హక్కుదారులను గావిస్తుంది". ఇన్ని ఫలితాలకు దయచేసే ఈపుణ్యకార్యాన్ని మనం విలువతో చూడవద్దా?
5. ఆఫ్రికాలో వేదబోధచేసిన ఒక గురువు ఆదేశంలో ఎనబైయేండ్ల వృద్దుని కొకనికి జ్ఞానస్నానమిచ్చారు. ఆ ముసలివాడు అటుతర్వాత రెండేండ్లు మాత్రం జీవించి ధన్యమైన మరణం మరణించాడు. అతడు చనిపోయేప్పుడు ఎవరో నీకు ఎన్నేండ్లని ప్రశ్నించారు. ఆ వృద్దుడు "నేను రెండేండ్లు మాత్రం జీవించాను. జ్ఞానస్నానానికి పూర్వం నేను జీవించిన జీవితం గణించతగింది గాదు" అని జవాబిచ్చాడు. ఈ సంస్కారానికి ఆ భక్తుడు ఇచ్చిన విలువ అంత గొప్పది.

2. జ్ఞానస్నాన స్థాపనం

స్నానం ద్వారా శుద్ధిని పొందడమనేది చాల ప్రాచీన మతాల్లో వుంది. గ్రీకు రోమను ఈజిప్టు యూద హిందూమతాల్లో ఈ తంతు ఏదోరూపంలో చూపడుతుంది. కనుక క్రీస్తు జ్ఞానస్నాన సంస్కారాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఆ స్నానాన్ని క్రొత్తగా స్థాపించలేదు. అంతకు పూర్వం వివిధ ప్రాచీన మతాల్లోవున్న తంతునే తీసికొని దానికి తన ప్రత్యేక వరప్రసాదాన్ని జోడించాడు. ఈ వరప్రసాదం ద్వారా మనకు క్రొత్తపట్టువు లభించేటట్లు చేసాడు. ఈ యధ్యాయంలో ఐదంశాలు పరిశీలిద్దాం.

1. వివిధ ప్రాచీన మతాల్లో స్నానం

1. జలం మాలిన్యాన్ని తొలగించి శరీరాన్ని శుద్ధిచేస్తుంది కదా! ఆలాగే అది ఆత్మమాలిన్యాన్ని- విశేషంగా కర్మకాండను పాటించడంలో కలిగే లోపాలవల్ల సంభవించే మాలిన్యాన్ని- తొలగిస్తుందనే భావం చాల ప్రాచీన మతాల్లో వుంది. ఇంకా నీరు మన దప్పికతీర్చి మనకు బలాన్నిఇస్తుంది. కనుక అది మనకు ఆరోగ్యాన్నీ శక్తినీ సత్తువనీ ప్రసాదిస్తుందని కూడ ప్రాచీనులు నమ్మారు.

పూర్వం ఈజిప్టులోను గ్రీసులోను ప్రజలకు మత రహస్యాలను బోధించేపుడు వాళ్ళచేత పవిత్ర స్నానాలు చేయించేవాళ్ళు ఈ స్నానాలద్వారా ఆ వ్యక్తులకు క్రొత్తపట్టువు కలుగుతుందని విశ్వసించేవాళ్ళు.