పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ విధంగా ఆత్మ మనకు తన పుణ్యాలనూ, వరాలనూ, ఫలాలనూ, అష్టభాగ్యాలనూ క్రమంగా దయచేస్తుంటుంది. ఇవి ఒకదానికంటె ఒకటి గొప్పవి.

3. సప్తవరాలను సాధించడం ఏలా?

మనం చిన్నపిల్లలంగావుండి జ్ఞానస్నానం పొందినపడే ఆత్మనుండి వరప్రసాదాన్నీ పుణ్యాలనూ సప్తవరాలనూగూడ స్వీకరిస్తాం. ఈ దివ్యశక్తులు మన హృదయంలో బీజాల్లాగ వండిపోతాయి. మనం పెరిగి పెద్దవాళ్లమై బుద్ధివివరం వచ్చాక ఈ యాధ్యాత్మిక శక్తులు మనలో పనిచేయడం మొదలిడతాయి.

వరాలను సాధించాలంటే మొదట వివేకం న్యాయం మొదలైన నైతిక పుణ్యాలను జాగ్రత్తగా పాటించాలి. నైతికంగా విశుద్ధ జీవితం జీవించనివాళ్ల హృదయాల్లో ఆత్మ వసించదు. అలాగే మనం పాపంనుండి వైదొలగుతుండాలి. లౌకిక వ్యామోహాలకు దూరంగా వుండాలి, మనం స్వీకరించింది లౌకికమైన ఆత్మకాదు, దేవుని ఆత్మ - 1కొరి 2, 12-14.

ఆత్మ మన హృదయంలో ఓ దేవాలయంలోలాగ వసిస్తుంటుంది -1కొరి 6,19. మనం ఈ ఆత్మసాన్నిధ్యాన్ని గుర్తించాలి. ఆయాత్మ మన హృదయంలో పట్టించే ప్రేరణలనూ ప్రబోధాలనూ అర్థంచేసుకోవాలి. ఆ దివ్యవ్యక్తిపట్ల భక్తి పెంపొందించుకోవాలి. అతడు కష్టాల్లో సుఖాన్నీ, గ్రీష్మంలో చల్లదనాన్నీ దుఃఖంలో ఉపశాంతినీ దయచేసేవాడు. అలాంటి ప్రభువుని తన సప్తవరాలను దయచేయమని అడుగుకోవాలి. తన్ను మనవిచేసే భక్తుల వేడికోలును ఆ యాత్మడు తప్పక వింటాడు.

ప్రశ్నలు

1.సదుపదేశాన్ని వివరించండి.

2.దైవభక్తిని గూర్చి తెలియజేయండి.

3.దృఢత్వాన్ని విశదీకరించండి.

4.దైవభీతిని వివరించండి.

5.తెలివిని గూర్చి తెలియజేయండి.

6.వివేకవరాన్ని విశదీకరించండి.

7.విజ్ఞానవరం ప్రాశస్త్యాన్ని తెలియజేయండి.