పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అసలు వరాలు ఎన్ని? క్రైస్తవ సంప్రదాయం ఏడని చెప్తుంది. బైబుల్లో గాని క్రైస్తవ సంప్రదాయంలో గాని ఏడు పూర్ణసంఖ్య అనగా ఈ యేడు ఆత్మయిచ్చేవరాలన్నిటిని సూచిస్తాయి, ఆత్మ వరాలన్నీ ఈ యేడు వరాల్లో యిమిడి వున్నాయని భావం. యథార్థంగా ఆత్మవరాలు ఎన్నయినా వుండవచ్చు. ఆత్మ ఆయా వ్యక్తుల అవసరాలనుబట్టి ఎవరికీయవలసిన వరాలను వారికిస్తుంది. కనుక ఈ వరాలు చాల వుండవచ్చు. కాని అవన్నీ కూడ ఏదోవొక రూపంలో ఈ యేడింటిలో ఇమిడే వుంటాయి. ఈ యేడు ఆత్మ దయచేసే సర్వవరాలకూ సూచనగా వుంటాయి.

ఆత్మవరాల్లో కొన్ని మనకు వ్యక్తిగత పావిత్ర్యాన్ని సంపాదించి పెడతాయి - Gifts. వీటిద్వారా ఆత్మ మన మీద పనిచేసి మనలను పరిశుద్దులను చేస్తుంది. పై సప్తవరాలు ఈ కోవకు చెందినవే. ఇవికాక, సేవావరాలు లేక ప్రేషిత వరాలు అనేవికూడ వున్నాయి - Charisms. ఇవి మన వ్యక్తిగత పావిత్ర్యానికి ఉపయోగపడవు. తోడి ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడతాయి. అద్భుతాలు చేయడం, భాషల్లో మాటలాడ్డం, ప్రవచనం చెప్పడం, వ్యాధులు కుదర్చడం మొదలైనవి ఈలాంటివి - 1కొ 12, 8-10. పెంతెకోస్తు ఉద్యమంలో ఈ సేవావరాలకు ఎక్కువ ప్రాముఖ్య మిస్తారు.

పుణ్యాల ప్రకారమూ, వరాల ప్రకారమూ జీవించే భక్తునిలో ఆత్మఫలాలు నెలకొంటాయి. ఇవి మొత్తం తొమ్మిది. ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం, విశ్వసనీయత, సాధుశీలత, ఇంద్రియ నిగ్రహం అనేవే ఈ ఫలాలు. పౌలు గలతీయుల జాబు 5,22లో వీటిని పేర్కొన్నాడు. వీటివల్ల హృదయంలో గొప్ప సంతోషభావమూ మాధుర్యభావమూ నెలకొంటాయి. ఈ ఫలాలు సప్తవరాలకంటెగూడ శ్రేష్టమైనవి.

ఆత్మఫలాలు పరిపక్వానికివచ్చిన హృదయంలో అష్టభాగ్యాలు ఉద్భవిస్తాయి. ఆత్మ మనకు దయచేసే అత్యున్నత వరప్రసాదాలు ఈ యష్టభాగ్యాలు. పర్వత ప్రసంగంలో ప్రభువు వీటిని ఎన్మిదింటినిగా పేర్కొన్నాడు, అవి దీనాత్మత, శోకార్తత, వినుమత, నీతి నిమిత్తం ఆకలిదప్పలు అనుభవించడం, దయ, నిర్మలత్వం, ధర్మార్ధం హింసలు అనుభవించడం, శాంతిస్థాపనం - మత్త 5,3-10. వీటివల్ల మనకు పరమానందం కలుగుతుంది, మనం మోక్షభాగ్యాన్ని అనుభవిస్తాం, ఆ భాగ్యం ఈ లోకంలో ప్రారంభమై పరలోక్షంలో పరిపూర్ణమౌతుంది. ఈ లోక్షంలో ఆత్మ మనకు దయచేసే వరప్రసాదాలన్నిటి లోను ఈ యష్టభాగ్యాలు అనేవి మహోత్కృష్టమైనవి.