పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్కరించుకోవడం మొదలుపెడదాం. ఆనందానుభూతి కలుగుతుంది. కనుక ఈ వరం మనకు అత్యవసరం.

3. ఈ వరాన్ని సాధించే మార్గం

ఈ వరంకోసం ఆత్మనే అడుగుకోవాలి. వినయంతోను భక్తిభావంతోను అడుగుకొనే వాళ్ళకి ఆత్మ ఈ భాగ్యాన్ని దయచేస్తుంది.

పవిత్రాత్మను గూర్చిన ఓ ప్రార్ధనం ఇది. "ఓ ప్రభూ! నీవు పవిత్రాత్మ వెలుగుద్వారా విశ్వాసుల హృదయాలకు బోధచేసావు. ఆయాత్మద్వారా మేము ఉచితమైన వాటిని ఆస్వాదించేలా అనుగ్రహించు. ఆ యాత్మ దయచేసే ఊరటవలన ఎల్లప్పడు ఆనందం చెందే భాగ్యాన్ని దయచేయండి".

ఈ ప్రార్ధనం పేర్కొన్నట్లు, ఆత్మద్వారా మనం ఉచితమైనవాటిని ఆస్వాదిస్తాం. అనగా భగవంతుణ్ణి ఆధ్యాత్మిక విషయాలనూ చవిజూస్తాం, ఆత్మ మనకు ఊరటనూ ఉపశాంతినీ దయచేస్తుంది.దానివల్ల ఆనందానుభూతి కలుగుతుంది. భగవంతుణ్ణి ఆస్వాదించి ఆనందానుభూతి చెందడమే విజ్ఞానవరం ప్రయోజనం. తన్నడుగుకొనే భక్తులకు ఆత్మ ఈ వరాన్ని తప్పక ప్రసాదిస్తుంది.

8. వరాల వివరణం

1. పుణ్యాలూ వరాలూ

పవిత్రాత్మ మనకు పవిత్రీకరణ వరప్రసాదాన్ని దయచేస్తుంది. పుణ్యాలనూ వరాలనూ గూడ ప్రసాదిస్తుంది. ఈ పుణ్యాలు రెండురకాలు. విశ్వాసం, నమ్మకం, ప్రేమ అనే మూడు దివ్యపుణ్యాలు. వివేకం, న్యాయం, మితత్వం, దృఢత్వం అనే నాల్గు నైతికపుణ్యాలు. ఈ నాల్గింటికి సంబంధించిన ఇతర నైతిక పుణ్యాలుకూడ వున్నాయి. సదుపదేశం, దైవభక్తి, దృఢత్వం, దైవభీతి, తెలివి, వివేకం, విజ్ఞానం అనే యేడువరాలు.

మనలో పుణ్యాలూ వరాలూ కలసే పనిచేస్తాయి. ఐనా ఆ రెండిటికి చాలా వ్యత్యాసముంది. పుణ్యాలను ఆచరించేపుడు మన ఆత్మేకర్త ఔతుంది. అనగా వరప్రసాద సహాయంతో మనమే ఆయా మంచిపనులు చేస్తాం. కాని వరాల విషయం వచ్చినపుడు పవిత్రాత్మకర్త ఔతుంది. ఆయాత్మ మనయాత్మ మీద పనిచేసి మనచే ఆయా మంచిపనులు చేయిస్తుంది.

పుణ్యాలను ఆచరించడమంటే తెడ్లతో పడవను నడిపించడం లాంటిది. అనగా మన కృషి ముఖ్యం. వరాలతో జీవించడమంటే తెరచాప యెత్తి పడవలో