పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మరి మనం ఏమిచేయాలి? వేదసత్యాలనూ దివ్యగ్రంథబోధలనూ నేర్చుకోవడం వల్ల మన హృదయం భక్తిభావంతో నిండిపోవాలి. ఆత్మ మన హృదయంమీద పనిచేసి దానికి గొప్ప వెలుగుని ప్రసాదించాలి. ఆ వెలుగులో మన ఆత్మ ఆ భగవంతుణ్ణి ధ్యానించి అతన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ఆ యనుభవంవల్ల మన హృదయం పాపంనుండి వైదొలగాలి. మనం మార్పుచెంది పుణ్యకార్యాలను చేయడానికి పూనుకోవాలి. ప్రేమభావంతో జీవించాలి. పలానా వేదసత్యంగాని, దివ్యగ్రంథంలోని పలానా అంశంగాని ఈనాడు మన జీవితానికి కూడ అక్షరాల వర్తిస్తుంది అన్నట్లుగా వుండాలి. అలా వర్తించడంవల్ల మన జీవితం మంచికి మారింది అనిపించాలి. వివేకం అనే దైవవరమే ఈ భాగ్యాలన్నిటినీ మనకు సంపాదించి పెడుతుంది.

7. విజానం

1. విజ్ఞానం అంటే యేమిటి?

ఈ వరంలో రెండంశాలున్నాయి. మొదటిది, దేవుని విలువనూ సృష్టివస్తువుల విలువనూ అర్థంజేసికొంటాం. భగవంతునిపట్లా, ప్రపంచంలోని అన్ని వస్తువులపట్లా నిర్దిష్టమైన భావాలు అలవర్చుకొంటాం. ఇంతవరకు ఈ వరం మన బుద్ధి శక్తికి సంబంధించింది అవుతుంది. విజ్ఞానాత్మకంగా వుంటుంది. మన బుద్ధిశక్తికి గొప్ప వెలుగుని ప్రసాదిస్తుంది.

రెండవది,భగవంతుణ్ణీ ఆధ్యాత్మిక విషయాలనూ ఆస్వాదిస్తాం. ఆ యాస్వాదనం వలన ఆనందమూ తన్మయత్వమూ కలుగుతుంది. ఈ రెండవ అంశంలో ఈ వరం మన చిత్తశక్తికి చెందిందవుతుంది. ప్రేమాత్మకంగా వుంటుంది.

వివేక వరం వలన దైవసత్యాలను వట్టినే అర్థం చేసికొంటాం. ఈ విజ్ఞానవరంవల్ల దైవసత్యాలను చవిజూస్తాం. అనుభవానికి తెచ్చుకొంటాం. ఆనందిస్తాం. మామూలుగా వేదశాస్త్రుల్లో దైవసత్యాలను గూర్చిన తెలివివుంటుంది. ఇది వివేకవరం. కానీ పునీతుల్లో ఆ దైవసత్యాలను అస్వాదించి ఆనందించడమనేదికూడ వుంటుంది. భగవంతుణ్ణి వ్యక్తిగతంగా అనుభవానికి తెచ్చుకొని గాఢంగా ప్రేమించడమనేది వుంటుంది. ఇదే విజ్ఞాన వరం.

ఆత్యయిచ్చే ఏడు వరాల్లోను ఈ విజ్ఞానవరం శ్రేష్ఠమైంది. ఈ వరంద్వారా మన దైవానుభూతీ, ఆనందానుభూతీ, ప్రేమభావమూ పరాకాష్ణ నందుకొంటాయి. అనగా ఆధ్యాత్మిక జీవిత శిఖరం మీదికి ఎక్కిపోతాం.

ఈ వరం పౌలుమీద పనిచేసింది. అతడు క్రీస్తుద్వారా తండ్రి మనకు దయచేసిన రక్షణాన్ని తలంచుకొని ప్రేమభావంతో పులకించిపోయాడు. "మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవునికి స్తుతికలుగును గాక" అన్నాడు — ఎఫే 3,1.