పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసికొంటాంగాని, మనం వాటికి దాస్యం చేయం. వాటిని నిచ్చెన మెట్లలాగ వాడుకొని దేవుని దగ్గర కెక్కిపోతాం.

3. ఈ వరాన్ని సాధించడం ఏలా?

దేహదారులమైన మనం నిరంతరమూ ఈ లోకవనువుల మధ్య మెలుగుతూంటాం. నిరంతరమూ వీటిని వాడుకొంటూంటాం. కాని మనం అన్ని వస్తువులనూ విశ్వాస నేత్రాలతో దర్శించాలి. ఏ వస్తువునైనాసరే అది కేవలం మన చర్మచక్షువులకు కన్పించినట్లుగా మాత్రమే చూడకూడదు. దాని నిజస్వభావాన్ని దర్శించాలి. అనగా ఆ వస్తువుకి కారణభూతుడైన భగవంతుణ్ణి గుర్తించాలి. వస్తువులు మనలను భగవంతుని చెంతకు చేర్చాలిగాని అతనినుండి వేరుపరుపగూడదు. ఈలాంటి దృక్పథాన్ని అలవర్చుకొంటే మనం వ్యామోహానికి గురికాము. క్రీస్తుతో పోల్చిచూస్తే సమస్త వస్తువులూ వట్టి చెత్తాచెదారమని భావిస్తున్నాను అన్నాడు పొలు - ఫిలి 3,8 మనం కూడ ఈలాంటి మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి.

ఇంకా మనం ప్రతి సంఘటనంలోను దేవుని హస్తాన్ని దర్శించడం నేర్చుకోవాలి, మామూలుగా అందరమూ ప్రియమైన సంఘటనల్లో దేవుని తోడ్పాటుని గుర్తిస్తాం. అతనికి వందనాలర్పిస్తాం. కాని అప్రియమైన సంఘటనలు కలిగినపుడు ఆలా చేయం. ఇది పెద్ద పొరపాటు, కష్టాల్లోకూడ దేవుని చేతిని చూడాలి. యోసేపు సోదరులు అతన్ని ఐగుపకి బానిసగా అమ్మివేసారు. కాని అతడు అక్కడ మంత్రి అయ్యాడు. తరువాత కరవువల్ల ఆ సోదరులు ఐగుపకి వెళ్లి ధాన్యం కొనుక్కోవలసి వచ్చింది. అక్కడ వాళ్ళు తమ్ముణ్ణి గుర్తుపట్టారు. అప్పడు యోసేపు "మీరు నాకు కీడు తలపెట్టి నన్ను బానిసగా అమ్మివేసారు. కాని ప్రభువు ఆ కీడుని మేలుగా మార్చాడు. మీ కంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపి ఈ కరువు కాలంలో నేను చాలమంది ప్రాణాలు నిలబెట్టేలా చేసాడు" అన్నాడు - ఆది 50, 22. మన జీవితంలో గూడ ఈలాంటి సంఘటనలు జరుగుతూంటాయి. ఆ యోసేపులాగే మనంకూడ ఆపదల్లో దేవుని హస్తాన్ని గుర్తించగలిగి వుండాలి.

ప్రభువు నాకు దీపం వెలిగిస్తాడు, నా త్రోవలోని చీకటిని తొలగిస్తాడు అన్నాడు కీర్తన కారుడు - 18,28. అతడు నిన్నుగూర్చి జాగ్రత్తపడతాడు అన్నాడు మరో కీర్తనకారుడు - 55,22. ఈలాంటి భావాలను భక్తితో మననం జేసికొంటే మనకు ఈ తెలివి అనే వరం తప్పక సిద్ధిస్తుంది.