పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వారా, క్రీస్తు సంపాదించిపెట్టిన ఈ శక్తిని మనకు సమృద్ధిగా దయచేస్తుంది. దీనిద్వారా మనం, పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేకుండానే, శ్రమపడవలసిన అగత్యం లేకుండానే, ఆయావస్తువులవైపు పారజూచిన వెంటనే వాటికి దేవునితో సంబంధం వుందని గ్రహించగల్గుతాం.

అన్నివస్తువులు దేవునినుండే పడతాయి, వాటిల్లో దేవుడు ప్రతిబింబిస్తుంటాడు. అవి మన మనసుని దేవునివైపు త్రిప్పతాయి. కనుక అన్ని వస్తువులుకూడ నిచ్చెన మెట్లలాగ మనలను దేవునిచెంత కెక్కించుకొనిపోతాయి. ఇదే తెలివి అనేవరం.

అసిస్సీఫ్రాన్సిస్ భక్తుడు అన్నిటిల్లోను దేవుణ్ణి చూచేవాడు. అతడు సూర్యచంద్ర నక్షత్రాదులూ నీరు గాలి అగ్ని భూమి పశుపక్ష్యాదులూ మొదలైనవాటి నన్నిటినీ దేవునికి బిడ్డలనుగాను తనకు సోదరీ సోదరులనుగాను భావించేవాడు. వాటిపట్ల పవిత్రమైన భావాలతో మెలిగేవాడు. ఈ భావాలను అతడు "సూర్యగీతం" అనే గేయంలో వ్యక్తం చేసాడు. ఇది తెలివి అనే వరం ఫలితమే.

కీర్తనకారుడు "ఆకాశం దేవుని మహిమను చూపెడుతూంది, అంతరిక్షం అతని సృష్టిని ప్రకటిస్తూంది" అన్నాడు - 19,1. మహాభక్తులు అన్ని సంఘటనల్లోను దేవుని హస్తాన్ని గుర్తించారు. దేవుడు తన్ను ప్రేమించేవాళ్ళకి అన్నీ మంచికే సమకూరేలా చేస్తాడు అని చెప్పాడు పౌలు - రోమా 8,28. ఈ భావాలన్నీ తెలివి అనే వరానికి నిదర్శనాలే.

2. ఈ వరంవల్ల లాభాలు

సృష్టివస్తువులు మనలను దేవుని చెంతకు చేర్చడానికి ఉద్దేశింపబడ్డాయి. Goro పాపఫలితంగా వాటిద్వారానే మనం దేవునికి దూరమైపోతుంటాం. ఆ వస్తువుల్లోనే తగుల్మొనిపోయి భగవంతునినుండి వైదొలగిపోతూంటాం, వస్తుప్రీతికి లొంగి పోతూంటాం. ఆలాంటప్పుడు ఈ వరం మనమీద పనిచేసి మనలోని వస్తువ్యామోహాన్ని చక్కదిద్దుతుంది. దేవుడు చేసిన వస్తువులను నమ్మి దేవుణ్ణి విస్మరించవద్దని హెచ్చరిస్తుంది. ఫలితంగా మనం అశాశ్వతములైన ఈ లోకవస్తువులనుండి వైదొలగి శాశ్వతుడైన ప్రభువుని ఆశ్రయిస్తాం.

దేహధారులమైన మనకు లోకవస్తువులేమో అవసరమే. తోడినరులు కూడుగుడ్డ యిల్లవాకిలి డబ్బు - ఇవన్నీ అవసరమే. కనుక మనం ఈ భౌతిక వస్తువులను పూర్తిగా పరిత్యజించలేం. కాని ఈ వరం ద్వారా లోకవస్తువులను ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకొంటాం. వాటిల్లో చిక్కుకోం, వాటిని మనకు దాసులనుగా