పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తేపతేపకు మనం స్వీకరించే దివ్యసత్రసాదం ద్వారా కూడ దైవబలాన్ని పొందుతాం. పూర్వం యూదులు మన్నాభోజనాన్ని తిని భౌతికమైన పుష్టిని పొందారు. నేడు మనం ఈ భోజనాన్ని ఆరగించి ఆధ్యాత్మికమైన పుష్టిని పొందుతాం - యోహా 6, 49-51. పవిత్రాత్మ దేవద్రవ్యానుమానాలద్వారా గూడ మన హృదయంమీద పని చేస్తుది. కనుక మనం ఈ భోజనాన్ని యోగ్యంగా భుజించి ఆ యాత్మనుండి దృఢత్వమనే వరాన్ని అధికాధికంగా పొందుతూండాలి.

4. దైవభీతి

1. దైవభీతి అంటే యేమిటి?

ఈవరంవల్ల దేవునిపట్ల బిడ్డల్లా మెలుగుతూ భయభక్తులతో ప్రవర్తిస్తాం. పాపంనుండి వైదొలగుతాం.

సేవకుడు యజమానుణ్ణి జూచి భయపడతాడు. విశేషంగా తాను తప్ప చేసినప్పడు యజమానుడు తన్ను శిక్షిస్తాడేమోనని భీతిజెందుతాడు. ఆలాగే కొందరు పాపంచేసి దేవుడు తమ్మ దండించి నరకానికి పంపుతాడేమోనని భీతిజెందుతారు. ఇది కేవలం శిక్షాభయం, దైవభీతి అనే వరానికీ ఈ భయానికీ ఏమీ సంబంధం లేదు.

బిడ్డలు తండ్రిపట్ల ప్రేమతో మెలుగుతారు. అతనిపట్ల వినయవిధేయతలూ భయభక్తులూ ప్రదర్శిస్తారు. కానిపనులు చేసి అతనికి అప్రియం కలిగించడానికి జంకుతారు. ఆలాగే దేవుడు కూడ మనకు గారాబు తండ్రి. మనమంటే అతనికెంతో ప్రీతి. కనుక మనం అతని ఆజ్ఞలుమీరి అతని మనసు నొప్పించడానికి భయపడతాం. అతని యెడల భయభక్తులతో మెలుగుతాం. ఇదే దైవభయమనే వరం.

పూర్వం దైవభక్తి అనే వరాన్ని చూచాం. ఆ వరం ద్వారా దేవుణ్ణి తండ్రిగా భావించి ప్రేమతో పూజిస్తాం. ఈ దైవభయమనే వరంవల్ల పాపంద్వారా దేవుని మనసునొప్పించడానికి వెనుకాడతాం. వళ్ళ దగ్గర పెట్టుకొని జీవిస్తాం.

కొందరు పునీతులు పాపం చేయడంకంటె చనిపోవడం మేలని యెంచారు. ఇగ్నేప్యస్ లొయోలా, డాన్బోస్కో మరియగొరెట్టి మొదలైనవాళ్ళంతా ఈలా భావించినవాళ్ళే ఇది యీ వరం ఫలితమే. ఈవరంవల్ల పాపం చేయడానికి వెనుకాడతాం, పామునుండిలాగ పాపం నుండి పారిపోతాం - సీరా 21,2.