పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనవాంఛకు లొంగి గడ్డితినాలనిపిస్తుంది. రోజువారిపనిని సంవత్సరం పొడవునా సంతృప్తికరంగా చేసికుంటూ పోవాలంటే యెంత వోపిక వుండాలి? వ్యాధిబాధలకూ కష్టాలకూ తట్టుకొని నిలవాలంటే యెంత స్టైర్యముండాలి? దేవుని పిలుపు విన్పించిన యువతీయువకులు ఆ పిలుపునిబట్టి పోవాలంటే యెంత తెగువ వండాలి? సాంఘిక అన్యాయాలను ఎదరించాలంటే ఎంత ధైర్యముండాలి? జీవితంలో ఒకోసారి ఎదురయ్యే నిరాశాభావాలను జయించాలంటే యెంత గుండె దిటవు కావాలి?

ఈలాంటి సందర్భాలన్నిటిలోను ఈ వరం మనకు ఉపయోగపడుతుంది. యోబు గ్రంథం వర్ణించినట్లుగా, ఈ లోక్షంలో మనుష్యజీవితం యుద్ధరంగం లాంటిది - 7,1, ఈ యుద్ధంలో ధైర్యంతో పోరాడాలంటే, విజయాన్ని చేపట్టాలంటే, దృఢత్వం కావాలి. మన శక్తి ఎంత? మన బండారమెంత? దైవశక్తి అండగా నిలువకపోతే మనం నెగ్గగలమా?

3. ఈ వరాన్ని సాధించడం ఎలా?

దృఢత్వమనేది ప్రధానంగా దైవబలాన్ని దయచేసే వరం. ఈ వరాన్ని పొందాలంటే మొదట మన బలహీనత మనకు బాగా తెలిసివుండాలి. పౌలు తన బలహీనతను తాను బాగా అర్థం చేసికొన్నాడు. అతడు దైవదర్శనాలు పొందాడు. వాటివల్ల అతనికి తల తిరగకుండా వుండటానికీ, అతన్ని అణచి వుంచడానికీ, ప్రభువు అతనికి ఏదో ఘటోరమైన బాధను కలిగించాడు. దాన్నే పౌలు "మల్లు" అని పేర్కొన్నాడు. ఆ మల్లని తొలగించమని అతడు ముమ్మారు ప్రభువుని మనవి చేసాడు. కాని ప్రభువు ఆ మల్లని తొలగించలేదు. "నా కృప నీకు చాలు. నీవు బలహీనుడివిగా వున్నపుడు నా శక్తి నీమీద పరిపూర్ణంగా పనిచేస్తుంది" అని చెప్పాడు. పౌలు తన బలహీనతను అంగీకరించాడు. దాని ద్వారానే అతడు గొప్ప దైవశక్తిని పొందాడు. కనుకనే నేనెప్పడు బలహీనుడో అప్పడే బలవంతుణ్ణి అని చెప్పకొన్నాడు -2 కొ 12, 7-10. మనంకూడ ఆ పౌలులాగే మన శక్తిహీనతనూ చేతగాని తనాన్నీ అంగీకరించాలి. ఆ ప్రభువుమీద ఆధారపడాలి. దివ్యబలాన్ని దయచేయమని అతన్ని అడుగుకోవాలి. అప్పడు అతని శక్తి మనమీద పనిచేస్తుంది. ఉత్థానక్రీస్తు శిష్యులతో "ఆత్మ వచ్చిందాకా మీరు యెరూషలేములోనే వుండండి. ఆత్మ దిగి వచ్చినపుడు మీరు శక్తిని పొందుతారు" అని చెప్పాడు - అ.చ. 18. శిష్యులు యథార్థంగా ఆత్మనుండి శక్తిని పొందారు, పొంది భూదిగంతాలవరకూ క్రీస్తుకి సాక్ష్యం పలికారు. నేడు మన జీవితంలో కూడ ఈలాగే జరుగుతుంది. ప్రభువు ఆత్మ మనకు అమోఘమైన శక్తినీ బలాన్నీ దయచేస్తుంది. వీటితో మనం గొప్ప విజయాలు సాధిస్తాం.