పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతన్ని తండ్రిగా చిత్రించే వేదవాక్యాలను శ్రద్ధతో ధ్యానం చేసికోవాలి. కనుక ఆలాంటి వాక్యాలను కొన్నిటిని అవలోకిద్దాం.

అబ్రాహాము మమ్మ ఎరుగకపోయినా,యాకోబు మమ్మ అంగీకరింపకపోయినా, ప్రభూ! నీవే మాకు తండ్రివి. అనాది కాలంనుండే మా విమోచకుడవని నీకే పేరు - యెష 63, 16. ప్రభూ! నీవే మా తండ్రివి. మేము మట్టిమైతే నీవు కుమ్మరివి. నీవే మమ్మ చేసావు. 64,6. తల్లి తన ప్రేవున బుట్టిన బిడ్డను మరచిపోతుందా? తన శిశువుని ప్రేమించకుండా వుంటుందా? ఒకవేళ తల్లి తాను కనిన బిడ్డను మరచిపోతే పోతుందేమోకాని, నేను మాత్రం మిమ్ము మరచిపోను - 49, 15. తండ్రి తన కుమారులమీద కరుణ జూపినట్లే ప్రభువు తనకు భయపడేవాళ్ళమీద జాలి జూపుతాడు - కీర్త 103, 13. మా అమ్మా నాన్నా నన్ను విడనాడినా యావే నన్ను చేరదీస్తాడు - కీర్త 28, 10, తండ్రి తన ప్రియ కుమారుని చక్కదిద్దినట్లే యావే తన కిష్టుడైన నరుణ్ణి శిక్షిస్తాడు - సామె 3,11-12.

పరలోకంలో వుండే మీ తండ్రికి మీ యక్కరలన్నీ తెలుసు - మత్త 6, 32. మీరెంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మేలివస్తువుల నీయాలని మీకు తెలుసుకదా! పరలోకంలో వుండే మీ తండ్రి తన్నడిగినవారికి ఇంకా యెట్టి మేలి వస్తువుల నిస్తాడో ఊహించండి.

దేవుడు లోకాన్ని యెంతో ప్రేమించి తన ఏకైక కుమారుడ్డి ప్రసాదించాడు. తన్ను విశ్వసించేవాళ్లు నాశమైపోకుండ నిత్యజీవాన్ని పొందడానికే అతడు అలా చేసాడు. - యోహా 3,16. నన్ను ప్రేమించేవాడు నామాట పాటిస్తాడు. అప్పడు నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు. మేము వానియొద్దకు వచ్చి వానితో నివసిస్తాం - 14, 23. మనం దేవుని బిడ్డలమని పిలువబడుతున్నాం అంటే దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడో ఊహించండి. ఔను, మనం నిజంగా దేవుని బిడ్డలమే - 1 యోహా 8,1. తండ్రిని ప్రేమించేవాడు ఆ తండ్రి బిడ్డలను గూడ ప్రేమించాలి-5,1.

ఈలాంటి వాక్యాలను ధ్యానించుకోవడంవల్ల భగవంతుడు తండ్రి అనే భావం బలపడుతుంది. దేవునికి ఎన్ని పేర్లున్నా మనం అతన్ని ప్రధానంగా తండ్రిగా గుర్తించాలనే అతని కోరిక. మన తరపున మనం అతనిపట్ల బిడ్డల్లా మెలుగుతూండాలి. చనువుతో, చొరవతో అతని చెంతకు వెళ్ళి మన కష్టసుఖాల్లో అతన్ని శరణు వేడుతూండాలి. ఇక, దేవుణ్ణి తండ్రినిగా గుర్తించే భాగ్యాన్నీ అతనిపట్ల బిడ్డల్లాగ మెలిగే మనస్తత్వాన్నీ ఆత్మే మనకు దయచేస్తుంది. మనచేత భగవంతుణ్ణి నాన్నా అని పిలిపించడం ఆయాత్మకు ఎంతో ఇష్టం.