పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పేత్రుకి ఆపత్కాలంలోఈలాంటి సలహా లభించింది. క్రీస్తు ఉత్తానానంతరం శిష్యులు యెరూషలేములో బోధిస్తున్నారు. ఆబోధ వినేటప్పటికి యూదనాయకులకు కన్ను కుట్టింది. వాళ్ళు శిష్యులను చెరలో త్రోయించారు. క్రీస్తునిగూర్చి బోధింపవద్దని ఆజ్ఞాపించారు. అప్పడు పేత్రు ఆత్మవల్ల ప్రబోధితుడై "మేము మీలాంటి మనుష్యులకు కాక దేవునికి విధేయులమై యుండాలి. మీరు క్రీస్తుని చంపారు. కాని తండ్రి అతన్ని రక్షకునిగా నియమించాడు. ఆ క్రీస్తుకి విధేయులైనవారికి పవిత్రాత్మ లభిస్తుంది” అని ప్రసంగించాడు – అచ 5,29–32

చాలమంది అర్చ్యశిషుల జీవితాల్లో ఈ సదుపదేశం అనే వరం ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. ఆంటోనైనస్ అనే భక్తునికి ఈ వరప్రసాదం మిక్కుటంగా వుండేది. ఆనాటి సామాన్య ప్రజలూ రాజకీయ నాయకులూ గూడ అతన్ని సలహా అడిగేవాళ్ళు సియన్నాపురి కత్తరీనమ్మగారిలో ఈ వరం మెండుగా వుండేది, ఆమె యువతిగా వున్నపుడే, చదువు సంధ్యలు లేక పోయినప్పటికి, రాజకీయ నాయకులకీ కార్డినల్సుకీ ఆలోచన చెపుండేది, ఆనాటి పోపుగారికికూడ సలహాదారిణి అయింది. వీరవనితయైన ఆర్మపురి జోన్ గారికి ఈ వరం పుష్కలంగా వుండేది. ఆమె ఫ్రెంచి సైన్యాలకి నాయకత్వం వహించి యుద్ధ వ్యూహాలు పన్నేది. ఈ వ్యూహాలు శత్రుసైన్యాధిపతులకు దిగ్ర్భాంతి కలిగించేవి. "మీరు నరమాత్రులనుండి సలహాను పొందారు. నేను దేవుని ఆత్మనుండి సలహా పొందాను" అని తన విరోధులకు చెప్పింది జోన్

2. ఈ వరంతో ఏమి యవసరం?

జీవితంలో బోలెడన్ని సమస్యలూ చిక్కులూ ఎదురౌతూంటాయి. ఆలాంటప్పుడు మామూలుగా తోడినరులను సలహా అడుగుతాం. మనం నమ్మినవాళ్ళనూ మన మిత్రులనూ సంప్రతిస్తాం. నరుల సలహా వలన లాభం కలుగుతుంది. కాని దేవుని సలహా వలన యింకా యొక్కువలాభం కలుగుతుంది. కనుక మనం పవిత్రాత్మను అడుగుకోవాలి.

కొన్ని పరిస్థితులు తీసికొందాం. మన యువతీయువకులు యుక్తవయస్సుకి వచ్చారు. వాళ్ళు గురుకన్యా జీవితాలే యెన్నుకోవాలో, లేక సంసార జీవితమే యెన్నుకోవాలో ఎలా తెలుస్తుంది? జీవితంలో మన అభిరుచులు ఒకవిధంగా ఉన్నాయి. ఉద్యోగావకాశాలు మరొక విధంగా ఉన్నాయి. అప్పడేమి చేయాలి? ఒకోసారి కొన్ని సమస్యలకు రెండుమూడు పరిష్కార మార్గాలు గోచరిస్తాయి. వాటిల్లో దేన్ని యెన్నుకోవాలి? ఈలాంటి చిక్కులు జీవితాంతమూ వస్తూనే వుంటాయి. వాటిల్లో మనకు సలహా అవసరం. ఈ వరం ఇందుకొరకే వుద్దేశింపబడింది.