పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అటుపిమ్మట అపోస్తలుల్లోకి ప్రవేశించి వారికి మూడువిధాలుగా ఉపయోగపడింది. మొదటిది, క్రీస్తు ఉత్దానానికి ముందు వాళ్ళకు అద్భుతాలు చేసే శక్తి నిచ్చింది. ఈ దశలో వాళ్ళ ఆత్మను సరిగా గుర్తించలేదు. రెండవది, క్రీస్తు ఉత్దానానంతరం వారిపై శ్వాసగా వేంచేసివచ్చింది. ఈ దశలో వాళ్లు ఆత్మను ఒక పాటిగా గుర్తించారు. మూడవది, క్రీస్తు మోక్షారోహణానంతరం పెంతెకోస్తు దినాన వారిమీదికి దిగివచ్చింది. ఈ దశలో ఆత్మ ఒక వ్యక్తిగా వారిలో వుండిపోయింది, ఈ దశలో అపోస్తలులు ఆత్మను స్పష్టంగా గుర్తించారు."

3. పై గ్రెగోరీ భక్తుడే ఇంకా యిలా చెప్పాడు. ఆత్మ మనకు నూత్న జన్మనిస్తుంది. మనలోని చీకట్లను తొలగించి మనకు వెలుగును ప్రసాదిస్తుంది. ఆత్మడు మహాజ్ఞాని, మహా ప్రేమమూర్తి, అతడు పూర్వం ఒక కాపరిలో ప్రవేశించి అతన్ని రాజనీ, కీర్తనకారుడ్డీ చేసాడు. అత్తిచెట్లను పెంచే మరో కాపరిలో ప్రవేశించి అతన్ని ప్రవక్తను చేసాడు. ఒక బాలునిలో ప్రవేశించి అతన్ని న్యాయమూర్తిని చేసాడు. బెస్తల్లో ప్రవేశించి వారిచే క్రీస్తనే వలలో నరులను చేపల్లా పట్టించాడు. దైవరాజ్యాసక్తిగల వేదహింసకునిలో ప్రవేశించి అతన్ని పౌలునిగా మార్చివేసాడు. నేడు ఆ యాత్మడ్డి మనంకూడ అనుభవానికి తెచ్చుకొందుముగాక."

85. కొన్ని ప్రార్థనలు

1. పరమపితా! నీ యాత్మను మా హృదయాల్లోకి పంపు. అతడు ప్రేరేపించి వ్రాయించిన బైబులు గ్రంథాన్ని మేము అర్థంచేసికొనేలా చేయి. ఆ గ్రంథానికి మేము వివరణం చెప్పేపుడు నీయాత్మ వద్దేశించిన భావాలను మాత్రమే తెలియజేప్పేలా అనుగ్రహించు. మా బోధలు వినే ప్రజలందరు సత్ఫలితాన్ని పొందేలా దయచేయి - సెరాపియన్ భక్తుడు.

2. బాధితులకు ఓదార్పునొసగే ఆత్మమా! వేంచేయి. మా దుష్టచేష్టలను సవరించి మా గాయాలను మాన్పే దైవవ్యక్తి దిగిరా. గర్వితులను అణచివేసి వినయాత్మలను ప్రోత్సహించే దివ్యశక్తి! దిగిరా. బలహీనులకు బలమును, పడిపోయినవారిని లేవనెత్తేవాడివినైన ఆత్మమా! విచ్చేయి. అనాథులకు తండ్రివి, పేదలకు ఆశామూర్తివి, నావికులకు నక్షత్రానివి, ఓడ మునిగినవారికి రేవువువైన మూడవవ్యక్తి వేంచేయి. ఆత్మలలో అతి పవిత్రుడవైన తండ్రీ! నామీదికి వేంచేసి నన్నుకరుణించు. నన్నుగూడ నీలాంటివాణ్ణిగా తయారుచేయి - ఫేకాంప్.