పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్నాడు – 1తెస్స 5,19. మనం చాలసార్లు ఆత్మప్రబోధం వినం. ఆత్మకు ద్రోహంగా పాపంచేస్తాం. అలాంటప్పుడు మన హృదయంలో వెలిగే ఆత్మను దీపాన్నిలాగ ఆర్పివేస్తాం. ఇంకా, సైఫను యూదులతో వాదిస్తూ పవిత్రాత్మను ఎదిరించవద్దని చెప్పాడు – అచ 7,51. ఆత్మ కలిగించే మంచి ఆలోచనలను బుద్ధిపూర్వకంగా తిరస్కరించి పాడుపనులు చేసినపుడెల్లా ఆత్మను ఎదిరిస్తుంటాం.

2. ఆత్మచేసే ప్రధానకార్యం, క్రీస్తుని మన చెంతకు తీసికొనిరావడం, మనలను క్రీస్తు చెంతకు తీసికొనిపోవడం, ఆ ప్రభువుపట్ల మనకు విశ్వాసం పుట్టించడం. ఆత్మ అనుగ్రహించందే యెవడుకూడ యేసే ప్రభువుని చెప్పలేడు -1కొ 12,3. అనగా ఆత్మ అనుగ్రహించందే ఎవడుకూడ యేసే దేవుడని విశ్వసించలేడు. కనుక ప్రభువుని పరిపూర్ణంగా విశ్వసించి నిండుహృదయంతో ప్రేమించే భాగ్యాన్ని దయచేయమని ఆత్మను అడుగుకొందాం.

ప్రార్ధనా భావాలు

1. యెరూషలేం సిరిల్ భక్తుడు ఈలా వ్రాసాడు. "పవిత్రాత్మ దయ్యాలుకూడ ఆత్మలే. కాని ఈ రెండురకాల ఆత్మలూ మనమీద పనిచేసే తీరుమాత్రం భిన్నంగా వుంటుంది. తోడేలు గొర్రెమీదికిలాగ పిశాచం నరుని మీదికి దూకుతుంది. నరుని పీడించి బాధించి నాశంజేస్తుంది. దయ్యం నరునికి సహజశత్రువు కనుక అది అతనిపట్ల బహుక్రూరంగా ప్రవర్తిస్తుంది. దీనికి భిన్నంగా పవిత్రాత్ముడు చాల మృదువుగా నరునిమీదికి దిగివస్తాడు. ఆ యాత్మ రాకముందే మన హృదయంలో ఓ విధమైన వెలుగూ జ్ఞానమూ జనిస్తాయి. పవిత్రాత్ముడు దయాపూర్వకంగా మన మీదికి దిగివస్తాడు. అతడు వచ్చేది మనలను కాపాడ్డానికి, బలపరచడానికి, హెచ్చరించడానికి, మనకు బోధ చేయడానికి, వెలుగును దయచేయడానికి చీకటిలో వున్నవాడు సూర్యకాంతిని చూడగానే ఉత్తేజం పొందుతాడు. చీకటిలో వున్నవుడు కన్పించని వస్తువులను చూస్తాడు, అలాగే ఆత్మను పొందినవాడుకూడ మనసులో ఉత్తేజాన్ని పొంది సామాన్య జనులు చూడలేని వస్తువులను చూస్తాడు. నరులకు తెలియని రహస్యాలను గ్రహిస్తాడు. అతనిదేహం భూమిమీదనే వున్నా ఆత్మమాత్రం మోక్షంలో వుంటుంది."

2. నాసియాన్సన్ గ్రెగోరి భక్తుడు ఈలా చెప్పాడు. మొదట పవిత్రాత్మ దేవదూతల్లో పనిచేసి వారికి తేజస్సునీ పాపం చేయకుండా వుండేశక్తినీ ప్రసాదించింది. తరువాత పితరుల్లో పనిచేసి వారికి దేవుణ్ణి తెలిసికొనే శక్తిని దయచేసింది. ఆ పిమ్మట ప్రవక్తల్లో పనిచేసి వారికి మెస్సీయాను గూర్చిన భవిష్యత్ జ్ఞానాన్ని ఇచ్చింది.