పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరచేవాళ్ళెవరూ లేరు. ఆత్మద్వారా తండ్రీ కుమారుడూ ప్రవక్తలూ మాట్లాడతారు. కాని బైబుల్లో ఆత్మ తన్ను గూర్చి తాను ఒక్కమాటకూడ చెప్పకోదు. ఆ యాత్మకు రూపురేఖలుండవు. అసలు ఆత్మ ఎవరోకూడ బైబులు స్పష్టంగా జెప్పదు. దైవవ్యక్తికి ఇంత వినయమూ అని మనం విస్తుపోతాం. మనలనుగూర్చి మనం లోకానికి తెలియజేసికోవాలని ఎంత ఆరాటపడతాం! మనలనుగూర్చి మనం ఎంతగా ప్రచారం జేసికొంటాం! ఆత్మకు ఈ కక్మూర్తి ఎంతమాత్రం లేదు.

2. ఆత్మడు నిరంతరం పనిచేస్తూనే వుంటాడు. కాని అతని పని తన కొరకు కాదు, మనకొరకు. మనలను పవిత్రులను చేయడంకొరకు.మనం క్రీస్తుని ప్రకటిస్తాంగాని ఆత్మను ప్రకటించం. ఆత్మద్వారా దేవుని తండ్రీ అని పిలుస్తాం. క్రీస్తుని ప్రభువు, దేవుడు అని పిలుస్తాం. కాని మనం ఆత్మను పేరెత్తి పిలచేలా చేసే దివ్యశక్తి ఏదీ లేదు. ఆత్మడు మనలను తండ్రి దగ్గరికీ కుమారుని దగ్గరికీ రాబడుతూంటాడుగాని తన దగ్గరికి రాబట్టుకోడు. ఇది వినయంగాకపోతే మరేమిటి?

3. నరుని శక్తి అతన్ని గర్వాత్ముణ్ణి చేస్తుంది. కాని ఆత్మశక్తి ఆ యాత్మను వినయాత్మణ్ణి చేస్తుంది. ఆత్మడు వినయవంతుడు ఐనట్లుగానే అతడు వసించే భక్తులుకూడ వినయంగానే వుంటారు. ఎప్పడుకూడ నరుల్లో వినయం గొప్పతనానికీ దైవసాన్నిధ్యానికీ గురుతు.

తండ్రి తాను చేసిన సృష్టితో ఐక్యమౌతుంటాడు. ఇది తండ్రి వినయం. కుమారుడు దైవస్వభావం కలవాడు. ఐనా తన్ను తాను రిక్తునిచేసికొని దాసుడై మానువునికి పోలికగా జన్మించాడు - ఫిలి 2,8. ఇది కుమారుని వినయం. పరిశుద్ధ రచయితలచే బైబులునంతటినీ వ్రాయించింది పవిత్రాత్మ. కాని ఆ యాత్మ ఈ గ్రంథంలో తన్ను గూర్చి తాను ఎక్కడా, ఏమీ స్పష్టంగా చెప్పించుకోలేదు. ఇది ఆత్మ వినయం.ఈ దైవవ్యక్తులనుజూచి గర్వాత్ముడైన నరుడు వినయాన్ని అలవర్చుకోవాలి. దేవునికి వినయం తగినట్లే నరునికి గర్వం తగుతుంది కాబోలు!

ప్రార్థనా భావాలు

1. ఇరెనేయస్ భక్తుడు ఈలా వాకొన్నాడు. పిండిని నీటితో తడపందే ముద్దకాదు. అలాగే ఆత్మ అనుగ్రహం లేందే మనం ఒకరితో ఒకరం ఐక్యంగాలేం. ఇంకా, ఎండిన నేలగాని నీరులేని చెట్టగాని ఫలించవు. వీటికి నీరు పెడితే ఫలిస్తాయి.అలాగే ఆత్మ అనుగ్రహం వుంటేనేగాని మనం కూడ ఫలించం.