పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దయచేస్తారు." ఈలాంటి వాక్యాలనుబట్టి ప్రాచీనకాలంనుండి తిరుసభలో పాపపరిహార ప్రక్రియా వుంది, ఆత్మద్వారా ఆ ప్రక్రియ జరుగుతుందనే నమ్మకమూ విశ్వాసుల్లో వుంది అనుకోవాలి.

3. యెరూషలేం సిరిల్ భక్తుని భావాల ప్రకారం, ఆత్మ మన పాపాలను మన్నించడం మాత్రమేకాదు. మన జీవితకాలమంతా సహాయంచేస్తు మనలను కాపాడుతూంటుంది. "నీవు దేవుని నమ్మితే ఆత్మ నీ పాపాలను మన్నిస్తుంది. అంతమాత్రమేకాదు, నీ శక్తికి మించిన కార్యాలను నీచే చేయిస్తుంది. నీ హృదయంలోని భక్తిని బట్టి నీవు ఆత్మ వరప్రసాదాన్ని పొందుతావు. నీ జీవితకాలమంతా ఆయాదరణ కర్త నీతో వుండిపోతాడు. ఆ దివ్యవ్యక్తి నిన్ను తన సైనికుణ్ణిలాగ ఆదుకొంటాడు. నీ కార్యాలన్నిటిలోను, విశేషంగా నీవు శత్రువులతో పోరాడేపుడు అతడు నిన్ను కాచి కాపాడతాడు. నీవు పాపంద్వారా ఆ యాత్మను దుఃఖపెట్టకుండా వుంటే చాలు, అతడు నీకు అన్ని వరప్రసాదాలు దయచేస్తాడు, ఆత్మను దుఃఖపెట్టవద్దు అనే వేదవాక్యం వుంది కదా! - ఎఫె 4,30."

కనుక మనం బలహీనతవల్ల పాపంలో పడిపోయినపుడెల్ల ఆత్మ సహాయాన్ని అడుగుకొని పశ్చాత్తాపపడాలి. అవసరమైనపుడు పాపసంకీర్తనంగూడ చేసికొని పాప పరిహారం పొందాలి. ఎప్పటికప్పుడు ఆత్మద్వారా శుద్ధిని పొందే వాడే నిజమైన క్రైస్తవుడు.

ప్రార్థనా భావాలు

1. కీర్తన 33,6 ఈలా చెప్పంది :

ప్రభువు తన వాక్కుతో ఆకాశాన్ని సృజించాడు
తన నోటి వూపిరితో సూర్యచంద్రులను చేసాడు.

ఇక్కడ దేవుని వాక్కంటే కుమారుడు. అతని నోటి వూపిరి అంటే పవిత్రాత్ముడు. ఈ యిద్దరిద్వారా దేవుడు లోకాన్ని సృజించాడని భావం. ఇరెనేయస్ వేదశాస్త్రి ఈ యిద్దరూ తండ్రికి రెండు చేతుల్లాంటివాళ్ళనీ ఈ యిద్దరి ద్వారానే అతడు సృష్టి చేసాడనీ వాకొన్నాడు.

2. నూత్న వేదాంతి అనబడే సిమియోను భక్తుడు ఈలా చెప్పాడు. "దేవుణ్ణి తెలిసికొనే ముఖ్యసాధనం పవిత్రాత్మ వరప్రసాదమే. ఈ వరప్రసాదం మన హృదయాలను శుద్ధిచేసి వాటికి వెలుగుని ప్రసాదిస్తుంది. ఈ వెలుగువల్ల మనం దేవుణ్ణి గ్రహించి విశ్వసిస్తాం. దీనివల్ల నూత్నజన్మను పొంది దేవునికి బిడ్డలమౌతాం. ఆత్మడు మనకు దైవజ్ఞానాన్ని దయచేసేవాడు కనుక అతనికి "తాళపుచెవి" అని పేరు వచ్చింది."