పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దుర్వినియోగం జేసికొని దేవుణ్ణి నిరాకరిస్తాడు. తనకు తానే దేవుడై పోతాడు. పాపంజేసి దేవునికి దూరమైపోతాడు. అపుడు ఆత్మ వరప్రసాదం అతనిపై సోకి అతడు మళ్ళా పశ్చాత్తాపపడేలా చేస్తుంది. తప్పిపోయిన కుమారుళ్ళా మళ్లా తండ్రి యింటికి తిరిగివచ్చేలా చేస్తుంది. అతడు ఈలా తిరిగివచ్చేలా చేసేది ఆత్మడే.

పెంతెకోస్తు దినాన ప్రజలు పేత్రు ఉపన్యాసం విని తీవ్రంగా మనసు నొచ్చుకొని సోదరులారా! మేము ఏంచేయాలి అని అడిగారు. పేత్రు మీరు పరివర్తనం చెంది యేసుక్రీస్తు నామాన జ్ఞానస్నానం పొందండి. అప్పుడు మీ పాపాలు పరిహారమౌతాయి. మీరు ఆత్మను పొందుతారు అని చెప్పాడు - అచ 2,37-38. ఇక్కడ ఆత్మే ఆ ప్రజల మనసులో బాధను పుట్టించి వాళ్ళకు పరివర్తనం కలిగించింది, వాళ్ళ ఆత్మలకు "మేలైన అతిథి" గా వాళ్ళ హృదయాల్లోకి దిగివచ్చింది. నేడు మనకు పరివర్తనం కలిగించి మన పాపాలను మన్నించేదికూడ ఆ యాత్మడే. అసలు ఆ పవిత్రమూర్తే మన పాపపరిహారం.

2. ఉత్తాన క్రీస్తు శిష్యులమీదికి శ్వాసనువూది "మీరు పవిత్రాత్మను పొందండి. మీరు ఎవరి పాపాలనైనా క్షమిస్తే అవి క్షమింపబడతాయి" అన్నాడు — యోహాను 20,23– 23. ఈ శిష్యులు పవిత్రాత్మశక్తితోనే పాపాలు మన్నించారు. ఈలా మన్నించే అధికారాన్ని తమ అనుయాయులకుకూడ యిచ్చిపోయారు. ఆదిమ తిరుసభ దైవప్రేరణచే పాపాల మన్నింపుకొరకు ఓ దేవద్రవ్యానుమానాన్నికూడ నెలకొల్పింది, అదే నేటి మన పాపసంకీర్తనం. ఆత్మకీ పాపపరిహారానికీ దగ్గరి సంబంధం వుంది. పవిత్రాత్మ మనకు పశ్చాత్తాపం పుట్టించి మన పాపాలను కడిగివేస్తుంది. తాను పవిత్రమూర్తిగాన మన అపవిత్రతను పూర్తిగా తొలగిస్తుంది. వెలుతురు చీకటిని పారద్రోలినట్లుగా మన కల్మషాన్ని నిర్మూలిస్తుంది.

పాపసంకీర్తనాన్ని కేవలం మన్నింపును పొందేతంతునుగా మాత్రమే భావించకూడదు. అది ప్రధానంగా నరునికి పరివర్తనం కలిగించే సంస్కారం. పరివర్తనమంటే మన హృదయాన్ని మార్చుకోవడం, ఈ మార్పుని ఆత్మమాత్రమే దయచేయగలదు. ఆత్మ పాపసంకీర్తనంలో గురువునీ పాపినీగూడ సోకి ఈ మార్పుని దయచేస్తుంది. ప్రవక్త యెహెజ్కేలు నుడివినట్లుగా, నరులకు నూత్న హృదయాలను దయచేసేవాడు ఆత్మడు - 36,26. పాపపరిహారం పొందిన నరుడు మళ్ళా దేవుణ్ణి ప్రేమించి అతని చిత్తప్రకారం జీవించడం మొదలుపెడతాడు.

అంబ్రోసు భక్తుడు ఈలా వ్రాసాడు, “మీరు ఎవరి పాపాలనైనా క్షమిస్తే అవి క్షమింపబడతాయని వేదశాస్త్రం చెప్తుంది. కాని నరులు తమ సొంత శక్తితోనే తోడి నరుల పాపాలను మన్నించలేరు. పితపుత్ర పవిత్రాత్మల నామాల మీదిగా వాళ్ళ పాపపరిహారాన్ని